అస్సాంలో సీఎం హిమంత బిశ్వ శర్మ నేరాలపై ఉక్కుపాదం మోపుతున్నాడు. నేరాల పట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు పవర్స్ ఇచ్చాడు. తాజాగా బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకుపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు నిందితుడిపైకి కాల్పులు జరిపారు. అయితే అతని లక్ బాగుండి కేవలం గాయాలతో బయటపడ్డాడు. గురువారం అస్సాంలోని కోక్రాజార్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
సోమవారం రాత్రి సరుకులు తీసుకువస్తున్న క్రమంలో దోల్మారా గ్రామంలో 16 ఏళ్ల బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారాన్ని మొబైల్ లో చిత్రీకరించారు. జరిగిన ఘోరంపై తండ్రి కోక్రాజార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసును విచారిస్తున్న పోలీసులు సంఘటన జరిగిన ప్రాంతంతో పాటు.. అత్యాచారాన్ని రికార్డ్ చేసిన మొబైల్ ను దాచిన ప్రాంతాన్ని చూపించేందుకు నిందితుడిని తీసుకెళ్లారు.
ఇదిలా ఉంటే నిందితులు దోల్మారా రాణిపూర్ టీ గార్డెన్ వద్దకు రాగానే సంఘటన స్థలాన్ని చూపుతూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. పోలీసుల నుంచి పిస్టల్ తీసుకుని నిందితుడు కాల్పులు జరిపే ప్రయత్నం చేశాడు. అయితే మరో పోలీస్ అధికారి పిస్టల్ తో నిందితుడిని కాలుపై కాల్చాడని ఏఎస్పీ పనేసర్ తెలిపాడు. నిందితుడిని చికిత్స కోసం కోక్రాగర్ ఆస్పత్రికి తరలించారు.
హిమంత బిశ్వ శర్మ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ కస్టడీ నుంచి పారిపోవడానికి ప్రయత్నించడం, చట్టాన్ని చేతిలో తీసుకున్న అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన చర్యల్లో 47 మంది మరణించారు 115 మంది గాయపడ్డారు.