Asim Munir: అమెరికా మిలిటరీ 250వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వాషింగ్టన్‌లో జరుగుతున్న మిలిటరీ పరేడ్‌కి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్‌ని అమెరికా ఆహ్వానించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఈ ఊహాగానాలను అమెరికా తోసిపుచ్చింది. ఇది తప్పుడు వార్త అని, విదేశీ సైనిక నాయకులను ఎవరూ ఆహ్వానించలేదు అని వైట్ హౌజ్ అధికారి ఒకరు చెప్పినట్లు వార్తాసంస్థ ఏఎన్ఐ పేర్కొంది.
Read Also: Israel Iran War: ఇరాన్‌లో 80 మంది మృతి.. గగనతలం మూసేసిన ఇజ్రాయిల్..
అమెరికా జనరల్ ఆసిమ్ మునీర్‌ని ఆహ్వానించినట్లు వార్తలు రావడంతో భారత్ నుంచి తీవ్ర స్థాయిలో రాజకీయంగా వ్యతిరేక వచ్చింది. ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్‌కు ఇది దౌత్యపరమైన ఎదురుదెబ్బగా కాంగ్రెస్ అభివర్ణించింది. “యుఎస్ ఆర్మీ డే (జూన్ 14) సందర్భంగా వాషింగ్టన్ డిసిలో నిర్వహించిన కార్యక్రమానికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌ను ఆహ్వానించినట్లు సమాచారం. ఈ వార్త దౌత్య ,వ్యూహాత్మకంగా భారతదేశానికి పెద్ద ఎదురుదెబ్బ” అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరామ్ రమేష్ ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో అన్నారు. “పహల్గామ్ ఉగ్రవాద దాడికి ముందు రెచ్చగొట్టే భాషను ఉపయోగించిన వ్యక్తి ఇతనే – అమెరికా ఉద్దేశ్యం ఏమిటి అనే ప్రశ్న తలెత్తుతుంది?” అని అన్నారు.
అయితే, కాంగ్రెస్ వ్యాఖ్యలను బీజేపీ తిరస్కరించింది. జైరాం రమేష్ భారతదేశ విదేశాంగ విధానంపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాడు అని ఆరోపించింది. ప్రధాని మోడీపై ఉన్న ద్వేషం కారణంగానే ఆసిమ్ మునీర్‌ని అమెరికా ఆహ్వానించిందని బాధ్యతారహిత వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ఎక్స్‌లో రాశారు. ప్రధానిని విమర్శించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ నేత తప్పుడు సమచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని అన్నారు.