Asaduddin Owaisi: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ బీహార్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ‘సీమాంచల్ అధికార యాత్ర’లో ప్రసంగిస్తూ.. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై విమర్శలు గుప్పించారు. సీఎం నితీష్ కుమార్ వల్లే తమ ఎమ్మెల్యేలు ఆర్జేడీలో చేరారంటూ మండిపడ్డారు. ముస్లిం ప్రాబల్యం అధికంగా ఉన్న సీమాంచ్ ప్రాంతంలో ఓవైసీ మూడు రోజులు పర్యటించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీమాంచల్ ప్రజలపై చూపిస్తున్న విపక్షకు వ్యతిరేకంగా మార్చి 18, మార్చి 19 తేదీల్లో ‘సీమాంచల్ అధికార యాత్ర’ జరుపుతున్నారు.
Read Also: Crime News: కన్నతల్లిని చంపి ఐదు ముక్కలు చేసిన కూతురు.. రెండు నెలలుగా ఇంట్లోనే
గత ఎన్నికల్లో కనీసం 50 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాల్సి ఉండేదని, నేను తప్పు చేశానని అన్నారు. ఈ సారి ఎక్కువ మందిని పోటీలో దించుతామని ఆయన అన్నారు. ఈరోజు పూర్ణియాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భారతదేశంలో బీజేపీని బలోపేతం చేసినందుకు నితీశ్ కుమార్ చరిత్రను గుర్తుంచుకుంటుందని, గుజరాత్ అల్లర్ల సమయంలో ఆయన రైల్వే మంత్రిగా ఉన్నారని గుర్తు చేశారు.
పొత్తుల గురించి మాట్లాడుతూ.. నితీష్ ముందుగా మోదీతో నిఖా చేసుకుని, ఆ తరువాత తలాక్ చెప్పారని, ఇప్పుడు తేజస్వీ యాదవ్ తో నిఖా చేసుకున్నారంటూ సెటైర్ల సంధించారు. గత ఎన్నికల్లో ఎంఐఎం పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు బీహార్ లో గెలుపొందారు. ఇందుల్లో కొచ్చాధమన్‌కు చెందిన ముహమ్మద్ ఇజార్ అస్ఫీ, జోకిహాట్‌కు చెందిన షహన్‌బాజ్ ఆలం, బైసీకి చెందిన రుక్నుద్దీన్ అహ్మద్ మరియు బహదుర్‌గంజ్‌కు చెందిన అంజర్ నైమి ఆర్జేడీలో చేరారు. బీహార్ రాష్ట్ర ఎంఐఎం అధ్యక్షుడు అక్తరుల్ ఇమాన్ మాత్రమే ఎంఐఎం ఎమ్మెల్యేగా మిగిలారు. బీహార్ అసెంబ్లీలో ఆర్జేడీని అతిపెద్ద పార్టీ చేయడానికి సీఎం నితీష్ ఇలా చేశారని అసదుద్దీన్ అన్నారు. ప్రస్తుతం బీహార్ అసెంబ్లీలో ఆర్జేడీకి 80 మంది, బీజేపీకి 77 మంది, నితీష్ కుమార్ జేడీయూకు 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.