Swati Maliwal assault Case: రాజ్యసభ ఎంపీ, ఆప్ నేత స్వాతి మలివాల్‌పై దాడి అంశం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఆప్ పార్టీ ఈ వ్యవహారం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు బీజేపీ ఆప్ లక్ష్యంగా విమర్శలు చేస్తోంది. స్వాతి మలివాల్‌పై సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన సహాయకుడు బిభవ్ కుమార్ దాడికి పాల్పడ్డాడు. ఈ వ్యవహారంలో బిభవ్ కుమార్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో బీజేపీ పథకం ప్రకారం స్వాతి మలివాల్‌ని ఉపయోగించుకుంటోందని ఆప్ ఆరోపిస్తోంది. ఆమె అవినీతి కేసులో ఇరుక్కోవడంతో బీజేపీ బ్లాక్మెయిల్ చేసిందని ఢిల్లీ మంత్రి అతిషీ ఆరోపించారు.
Read Also: Election Commission: రాహుల్ గాంధీ “అగ్నివీర్”, “రాజ్యాంగం రద్దు” వ్యాఖ్యలపై ఈసీ ఆగ్రహం..
ఇదిలా ఉంటే ఈ కేసులో సీఎం కేజ్రీవాల్ మౌనంగా ఉండటాన్ని బీజేపీ ప్రశ్నిస్తూ వస్తోంది. తాజాగా ఆయన తొలిసారిగా స్వాతిమలివాల్‌పై దాడి ఘటనపై స్పందించారు. దాడిపై న్యాయమైన దర్యాప్తు జరుగుతుందని ఆశిస్తున్నట్లు బుధవారం చెప్పారు. ఈ కేసు న్యాయపరిధిలో ఉందని, తన వ్యాఖ్యలు విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉందని చెప్పారు. న్యాయమైన విచారణ జరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ వ్యవహారంలో రెండు వెర్షన్లు ఉన్నాయని, పోలీసులు రెండు వెర్షన్లను న్యాయంగా విచారించాలని, న్యాయం చేయాలని అన్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో మీరు అక్కడే ఉన్నారా..? అని అడిగనప్పుడు, తాను ఘటనా స్థలంలో లేనని చెప్పారు.
మరోవైపు బుధవారం స్వాతి మలివాల్ సంచలన ఆరోపణలు చేశారు. తనను కించపరిచేలా వ్యాఖ్యలు చేయాలని, తన పర్సనల్ ఫోటోలను లీక్ చేయాలని పార్టీ పలువురిపై ఒత్తిడి తీసుకువస్తోందని ఆమె ఆరోపించారు. ఈ విషయాన్ని సీనియర్ ఆప్ నాయకులు ఫోన్ చేసి చెప్పినట్లు వెల్లడించారు. నిందితుడు శక్తివంతమైన వ్యక్తి అని, అతనికి వ్యతిరేకంగా పెద్ద నాయకులు కూడా మాట్లాడటం లేదని నిరాశను వ్యక్తం చేశారు. ఎవరో ప్రెస్ కాన్ఫరెస్ డ్యూటీని చేస్తుంటే, మరొకరు ట్వీట్స్ చేసే బాధ్యత అప్పగించబడిందని ఆప్‌లో పలువురు నాయకుల గురించి పరోక్షంగా విమర్శించారు.