ఆప్ అధినేత కేజ్రీవాల్ లక్ష్యంగా కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ లాగానే కేజ్రీవాల్ కూడా తప్పుడు వాగ్దానాలు ఇస్తు్న్నారని ధ్వజమెత్తారు. వెనుకబడిన వర్గాలు, ఎస్సీ, ఎస్టీలు మైనార్టీలకు వారి హక్కులు దక్కాలని ప్రధాని మోడీ, కేజ్రీవాల్ కోరుకోవడం లేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. అందుకే కులగణనపై వారు మౌనంగా ఉన్నారని విమర్శించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శీలంపుర్‌లో నిర్వహించిన ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ సభలో రాహుల్ పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపెడతామని.. తాము చేయగలిగినది ఆప్, బీజేపీలు చేయలేవని ధ్వజమెత్తారు.
ఇది కూడా చదవండి: Recharge Plans: మొబైల్ యూజర్లకు పండగే.. అదిరిపోయే బెనిఫిట్స్ తో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే!
ప్రధాని మోడీ తప్పుడు వాగ్దానాల మాదిరే.. ఢిల్లీ మాజీ సీఎం కూడా అదే ప్రచార వ్యూహాన్ని అనుసరిస్తున్నారన్నారు. దేశంలో పేదలు పేదలుగా, సంపన్నులు మరింత సంపన్నులుగా మారుతున్నారని వివరించారు. వెనుకబడిన వర్గాలకు వారి హక్కులు లభించడం లేదని.. మేం అధికారంలోకి వస్తే కులగణన చేపడతామని హమీ ఇచ్చారు. మోడీ, కేజ్రీవాల్ ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తామని హామీ ఇచ్చారని.. కానీ ఈ విషయంలో విఫలమయ్యారన్నారు.
దేశ రాజధానిలో 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదలకానున్నాయి. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది.