Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో ఈ రోజు ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది. ఈ అరెస్టులో లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైన ఆప్ నేతల సంఖ్య 4కి చేరింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన సత్యేందర్ జైన్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ అరెస్ట్ కాగా ప్రస్తుతం కేజ్రీవాల్ కూడా అరెస్టయ్యాడు.
ఇదిలా ఉంటే అరెస్టులో కూడా కేజ్రీవాల్ రికార్డ్ క్రియేట్ చేశారు. సిట్టింగ్ సీఎంగా ఉండీ అరెస్టైన తొలి ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ రికార్డ్ సృష్టించారు. అయితే, తమ నాయకుడు జైలు నుంచే ముఖ్యమంత్రిగా పాలన నిర్వహిస్తారని ఆప్ నేతలైన అతిషీ, రాఘవ్ చద్దా లాంటి వాళ్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈడీ, బీజేపీ ప్రభుత్వం కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేయొచ్చు కానీ, ఆయన ఆలోచల్ని కాదని చెప్పారు.
Read Also: AAP Ministers: కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయొచ్చు.. ఆలోచనలను కాదు
జనవరి 31న రూ. 600 కోట్ల భూ కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ని ఈడీ అరెస్ట్ చేసింది. అయితే, ఆయన అరెస్టుకు ముందు సీఎం పదవికి రాజీనామా చేశారు. రాంచీలో సోరెన్ నివాసంలో ఈడీ ప్రశ్నించిన తర్వాత అరెస్ట్ చేసే క్రమంలో, ఆయన తన రాజీనామాను గవర్నర్ సీవీ రాధాకృష్ణన్‌కు అందజేశారు.
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, అన్నాడీఎంకేకి చెందిన దివంగత మాజీ సీఎం జయలలిత, చంద్రబాబు నాయుడు, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ చీఫ్ ఓం ప్రకాష్ చౌతాలా జైలుకి వెళ్లిన మాజీ ముఖ్యమంత్రుల్లో ఉన్నారు.