ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్‌ను ఆప్ మంత్రులు, ముఖ్య నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈడీ అధికారులు అక్రమంగా అరెస్ట్ చేశారంటూ మండిపడ్డారు. రాజకీయ దురుద్దేశంతోనే ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అరవింద్ కేజ్రీవాల్ అంటే ప్రజలకు ప్రేమ, అభిమానం అని మంత్రి అతిషి తెలిపారు. ఏవో కారణాలు చూపి కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయొచ్చు.. కానీ అతని ఆలోచనలను అరెస్ట్ చేయలేరని తెలిపారు. కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేస్తే వీధిలో మరో కేజ్రీవాల్ పుట్టుకొస్తారని పేర్కొన్నారు. సోదాల పేరుతో ఈడీ అధికారులు కేజ్రీవాల్ ఫోన్ తీసుకున్నారని.. కేజ్రీవాల్ సెక్రటరీ మొబైల్ కూడా తీసుకున్నారని తెలిపారు. కేజ్రీవాల్ అరెస్ట్‌తో బీజేపీ పన్నాగం బయటపడింది అని సౌరభ్ భరద్వాజ్, అతిషి ఆరోపించారు. లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటికీ ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని.. జైలు నుంచి పాలన సాగిస్తారని అతిషి స్పష్టం చేశారు.
లిక్కర్ స్కామ్‌లో ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు గురువారం అరెస్ట్ చేశారు. ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగాయని ఈడీ అధికారులు ఆరోపించారు. కేజ్రీవాల్ సర్కార్ 2021లో లిక్కర్ పాలసీని తీసుకొచ్చారు. 2022లో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ముడుపులకు అనుకూలంగానే ఈ పాలసీని తీసుకొచ్చారని ఈడీ ఆరోపించింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ అధికారులు తొమ్మిది సార్లు కేజ్రీవాల్‌కు నోటీసులు ఇచ్చారు. కానీ ఆయన ఇప్పటి వరకు విచారణకు హాజరుకాలేదు. ఈడీ సమన్లపై ఢిల్లీ హైకోర్టును కేజ్రీవాల్ ఆశ్రయించారు. విచారణలో అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కానీ అందుకు కోర్టు నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్నారు.
తాజాగా గురువారం కేజ్రీవాల్‌కు 10వ సారి ఈడీ సమన్లు అందజేసింది. అనంతరం 2 గంటల పాటు ఆయన్ను విచారించిన అనంతరం ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా అరెస్ట్ అయి గతేడాది నుంచి జైల్లో ఉన్నారు. తాజాగా ముఖ్యమంత్రి సైతం జైలుకెళ్తున్నారు. ఈ ఏడాది ఈడీ అధికారులు ఇద్దరు ముఖ్యమంత్రులను అరెస్ట్ చేశారు. ఇటీవలే మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను అరెస్ట్ చేయగా.. తాజాగా రెండో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు.