BJP: దేశంలోని అసమానత, వివక్ష నిజాన్ని బయటకు తీసుకురావడానికి కుల గణన సహాయపడుతుందని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ధ్వజమెత్తుతోంది. శుక్రవారం, కాంగ్రెస్ ఎంపీపై విమర్శలు చేసింది. ‘‘కుంభమేళాలో ఎవరూ కులం గురించి అడగలేదు. ఎవరూ ఎవరినీ అవమానించలేదు. ఎవరికీ డెంగ్యూ లేదా మలేరియా రాలేదు. ఎవరూ ఒకరిపై ఒకరు రాళ్ళు రువ్వుకోలేదు. సనాతన ధర్మం యొక్క బలాన్ని అర్థం చేసుకున్నప్పటికీ, మీరు ఇప్పటికీ కులం గురించి మాట్లాడాలని అనుకుంటున్నారా..?’’ అని బీజేపీ ఎంపీ దినేష్ శర్మ అన్నారు.
‘‘మీరు (రాహుల్ గాంధీ) ఓడిపోయారు. మీరు ఎంత ఎక్కువగా కులగణన అడిగితే అంత ఎక్కువగా ఓడిపోతారు’’ అని గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిని ప్రస్తావిస్తూ ఆయన అన్నారు. గతేడాది లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కుల గణన నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.
Read Also: Deputy CM Bhatti: గత ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ప్రయత్నించింది..
గురువారం, మాజీ గ్రాంట్ కమిషన్ చైర్మన్, విద్యావేత్త సుఖ్‌దేవ్ థోరాట్‌లో జరిగిన ఒక డిబేట్‌లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కుల గణన అసమానలను బయటకు తీసుకురావడానికి ఒక ముందడుగు అని, కుల గణనను వ్యతిరేకించే వారు నిజాలు బయటపడొద్దని చూస్తు్న్నారని ఆరోపించారు. 1927లో జరిగిన మహద్ సత్యాగ్రహం ద్వారా అంబేద్కర్ కుల వివక్షను నేరుగా సవాల్ చేశారని రాహుల్ గాంధీ అన్నారు. ఇది కేవలం నీటి కోసం పోరాటం కాదని, సమానత్వ, గౌరవం కోసం అని, 98 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ పోరాట నేటికి కొనసాగుతోందని కాంగ్రెస్ నేత అన్నారు.
దేశంలో మెరిట్ ఆధారిత వ్యవస్థను రాహుల్ గాంధీ విమర్శించారు. ఇది దళితులు, వెనకబడిన తరగతులు, గిరిజనుల పట్ల లోపభూయిష్టంగా ఉందని, అన్యాయంగా ఉందని చెప్పారు. మన విద్యా వ్యవస్థ, బ్యూరోక్రసీ ప్రవేశ వ్యవస్థలు దళితులు, ఓబీసీలు, గిరిజనులకు న్యాయం చేస్తుందని ఎవరైనా అనుకుంటే పూర్తిగా తప్పని రాహుల్ గాంధీ అన్నారు. మెరిట్ వ్యవస్థ ‘‘ఉన్నత కులాలు కథనం’’ అని అన్నారు.