Amritpal Singh: ఖలిస్తానీ వేర్పాటువాద నేత, ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృత్ పాల్ సింగ్ గత పది రోజులుగా తప్పించుకు తిరుగుతున్నాడు. పంజాబ్ లో ఖలిస్తానీ వేర్పాటువాదాన్ని పెంచి పోషించేందుకు దేశ అంతర్గత శక్తులతో కలిసి కుట్ర పన్నాడు. దీంతో పంజాబ్ పోలీసులు అతడిపై అతని అనుచరులపై భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఇదిలా ఉంటే అతని అనుచరులను ఇప్పటికే పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ అమృత్ పాల్ సింగ్ మాత్రం హర్యానా మీదుగా ఢిల్లీ చేరుకుని నేపాల్ మీదుగా విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి.
Read Also: Ajit Doval: చైనాను ఉద్దేశించి అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు..
పలు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్న అమృత్ పాల్ సింగ్ ను, అతడి సహచరులను పట్టుకునేందుకు మంగళవారం రాత్రి పోలీసులు హోషియార్‌పూర్‌తోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో ప్రతీ ఇంటిని గాలించారు. ఆ ప్రాంతంలో అమృత్ పాల్ సింగ్ ఉన్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు. హోషియార్‌పూర్‌లోని మారయాన్ గ్రామంలోని గురుద్వారా వద్ద అమృతపాల్ సింగ్ ఇన్నోవా కారును పొలాల్లో నిలిపివేసి పారిపోయినట్లు తెలుస్తోంది. కారును పోలీసులు స్వాధీనం చేస్తుకున్నారు. అయితే అమృత్ పాల్ సింగ్ లొంగిపోయేందుకు సిద్ధం అవుతున్నట్లు పంజాబ్ పోలీసులు భావిస్తున్నారు. తాను లొంగిపోయే ముందు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసమే అతను పంజాబ్ కు తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది.
గత నెల అజ్నాలా పోలీస్ స్టేషన్ పై దాడి చేసి ఎస్పీతో పాటు పలువురు పోలీసులపై దాడి చేసి అతడి మద్దతుదారులను విడిపించుకుపోయాడు. అప్పటి నుంచి అతడిని అరెస్ట్ చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఖలిస్తాన్ వేర్పాటువాదానికి పాక్ ఐఎస్ఐ సహకారం ఉందని, విదేశాల నుంచి నిధులు వస్తున్నట్లుగా ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు. ఇతడి సన్నిహితులకు పాకిస్తాన్ తో లింకులు కూడా బయటపడ్డాయి. ఇక పాక్, దుబాయ్ లో ఉంటున్న ఖలిస్తానీ ఉగ్రవాదులతో అమృత్ పాల్ సింగ్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.