Karnataka Politics: కర్ణాటక సీఎం పదవి వ్యవహారం ఢిల్లీకి చేరింది. కర్ణాటకలో కాంగ్రెస్ గ్రాండ్ విక్టరీ సాధించినా.. సీఎం అభ్యర్థి ఎవరనేది తేలడం లేదు. పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇద్దరు కూడా సీఎం అభ్యర్థిత్వాన్ని కోరుకోవడం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఇదిలా ఉంటే సీఎం రేసులో మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయి. తమ నేతకే సీఎం పదవి కావాలని కాంగ్రెస్ లీడర్ జీ పరమేశ్వర అనుచరులు తుమకూరులో భారీ ర్యాలీ చేపట్టారు.
ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కీలకంగా మారిన లింగాయత్ వర్గం, తమ వారికే సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 34 మంది లింగాయత్ లు ఉన్నారని, తమ వారి నుంచే ముఖ్యమంత్రి ఉండాలని కోరుతూ అఖిల భారత వీరశైవ మహాసభ డిమాండ్ చేస్తోంది. దీంట్లో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ కూడా రాశారు. కాంగ్రెస్ మొత్తం 46 మంది లింగాయత్ వర్గానికి చెందిన అభ్యర్థులను నిలబెడితే.. అందులో 36 మంది గెలిచారు.
Read Also: DK Shivakumar: సీఎం పదవిపై డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే దళిత వర్గానికే ముఖ్యమంత్రి సీట్ ఇవ్వాలని, కాంగ్రెస్ సీనియర్ నేత, దళితుడైన జీ పరమేశ్వర మద్దతుదారులు ప్రదర్శనలు చేశారు. ‘దళితుడే సీఎం కావాలి’ అని రాసి ఉన్న ప్లకార్డులతో తుమకూర్ లో సభ నిర్వహించారు. బీజేపీకి కీలక మద్దతుదారులుగా ఉన్న లింగాయత్ లు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. ఇదే కాంగ్రెెస్ ఘన విజయానికి కారణం అయింది. కర్ణాటకలో 17 శాతం ఉన్న లింగాయత్ లు ఏకంగా 100 సీట్లలో ఫలితాన్ని శాసించగలరు.
బీజేపీలో లింగాయత్ వర్గానికి చెందిన నేత, మాజీ సీఎం యడియూరప్పను సైడ్ చేయడం, మరో లింగాయత్ నేత జగదీష్ షెట్టర్ బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడం బీజేపీ విజయావకాశాలను దెబ్బతీశాయి. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 135 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ 66, జేడీఎస్ 19 స్థానాల్లో గెలిచింది. ప్రస్తుత కాంగ్రెస్ లో సీఎం పోటీకి వినబడుతున్న పేర్లలో డీకే శివకుమార్ వొక్కలిగ వర్గానికి చెందగా.. సిద్దరామయ్య కురబ సామాజిక వర్గానికి చెందిన వారు.