Amid Covid Concerns, No Entry For Tourists In Taj Mahal Without Testing: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మళ్లీ విజృంభిస్తోంది. చైనా వ్యాప్తంగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్-7 విస్తరిస్తోంది. కరోనా ప్రారంభం అయిన గత మూడేళ్లలో ఎప్పుడూ లేని విధంగా అక్కడ కేసులు నమోదు అవుతున్నాయి. నిపుణుల అంచనా ప్రకారం రానున్న మూడు నెలల్లో చైనాలో 10 లక్షల మరణాలు సంభవిస్తాయని అంచనా వేస్తున్నారు. మూడు నెలల్లో మూడు కరోనా వేవ్ లు చైనాను దెబ్బకొడతాయని అంచనా వేస్తున్నారు.
Read Also: Charles Sobhraj: అల్లుడు వస్తున్నందుకు ఆనందంగా ఉంది.. చార్లెస్ శోభరాజ్ అత్త
ఇదిలా ఉంటే బీఎఫ్-7 వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో భారత్ కూడా అప్రమత్తం అయింది. ఇప్పటికే ఈ వేరియంట్ దేశంలో నలుగురికి సోకింది. దీంతో బుధవారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రద్దీ ప్రాంతాల్లో మాస్కులు ధరించాలని.. నమూనాలను జినోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించాలని కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది. గురువారం భారత ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో కరోనాపై సమావేశం జరుగుతోంది. ఇక కేరళ, ఢిల్లీ రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. ఆయా రాష్ట్రాల ప్రజలను అప్రమత్తం చేస్తోంది.
ఇదిలా ఉంటే ప్రసిద్ధ సందర్శనీయ స్థలం తాజ్ మహల్ చూసేందుకు వచ్చే పర్యాటకులకు ఆంక్షలు విధించింది ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం. తాజ్ మహల్ సందర్శించేందుకు దేశ, విదేశీ పర్యాటకులు ప్రతీరోజూ లక్షల్లో వస్తుంటారు. అయితే పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సందర్శకులు ముందుగా కోవిడ్ పరీక్ష చేయించుకోవాలని ఆగ్రా జిల్లా అధికారులు సూచించారు. సందర్శకులు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని స్పష్టం చేశారు. కోవిడ్ పరీక్షలు చేయించుకోనిదే తాజ్ మహల్ సందర్శనకు అనుమతించమని చెప్పింది.