Centre vs AAP: ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) సర్కార్, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ‘పవర్ వార్’ కొనసాగుతోంది. ఇటీవల సుప్రీంకోర్టు అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో అధికారాలు ఎన్నుకోబడిన ప్రభుత్వానికే ఉండాలని కీలక తీర్పు చెప్పింది. సుప్రీం తీర్పు నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ ఐఏఎస్ అధికారుల బదిలీలపై దృష్టిపెట్టారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ అధికారాలకు కత్తెర వేస్తూ.. కొత్తగా ఆర్డినెన్స్ ను తీసుకువచ్చింది.
కేంద్రం ఈ ఆర్డినెన్స్ ద్వారా నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీసెస్ అథారిటీని ఏర్పాటు చేసింది. ఇది ఢిల్లీ ప్రభుత్వంలోని ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాలపై నిర్ణయాలు తీసుకుంటుంది. దీంట్లో ముఖ్యమంత్రి చైర్ పర్సన్ గా, చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ హోం సెక్రటరీ సభ్యులుగా ఉంటారు. మెజారిటీ ప్రతిపాదికన నిర్ణయం తీసుకుంటారు. ఎప్పుడైనా ఓటింగ్ లో ఫలితం తేలకుంటే.. లెఫ్టినెంట్ గవర్నర్ దే తుది నిర్ణయంగా ఉంటుంది.
Read Also: Congress: ఇక తెలంగాణ, మధ్యప్రదేశ్‌పై కాంగ్రెస్ నజర్.. మే 24న మీటింగ్..
ఇదిలా ఉంటే ఈ ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలను విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆప్, సీఎం కేజ్రీవాల్ కు మద్దతు ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీయాదవ్ ఈ రోజు సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో భేటీ అయ్యారు. ఆయనకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను కూడగట్టే పనిలో ఉన్నారు నితీష్ కుమార్. ప్రస్తుతం ఈ ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా రాజ్యసభలో ప్రతిపక్షాలను కూడగట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఈ ఆర్డినెన్స్ చట్టంగా మారకుండా ఉండేందుకు.. రాజ్యసభలో బిల్లును అడ్డుకోవాలని అనుకుంటున్నారు. ఈ బిల్లు రాజ్యసభలో పాస్ కాకపోతే.. 2024 ఎన్నికల ముందు బీజేపీ ఓడిపోయినట్లు చెప్పొచ్చని, మళ్లీ బీజేపీ అధికారంలోకి రాదని చెప్పొచ్చని నితీష్ అన్నారు.
సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వానికి పని చేసే హక్కును ఇచ్చింది, మీరు దానిని ఎలా తీసివేయగలరు? అని ప్రశ్నించారు. వీలైనన్ని ఎక్కువ ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయడానికి ప్రయత్నిస్తున్నామని నితీష్ చెప్పారు. చట్టబద్ధమైన పాలనను అనుసరించాలని, ప్రజల మధ్య సామరస్య ఉండాలని, ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే ప్రయత్నం జరుగుతోందని, ఇది తప్పని నితీస్ అన్నారు. సోమవారం బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలుస్తున్నట్లు నితీష్ చెప్పారు. కేంద్రం తీసుకున్న ఈ చర్య ప్రజాస్వామ్యానికి ప్రమాదం అని తేజస్వి యాదవ్ అన్నారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని, అలా జరగనివ్వబోమని ఆయన అన్నారు.