2024 లోక్ సభ ఎన్నికలకు మరికొన్ని నెలలు మాత్రమే సమయంలో ఉండటంతో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి బీజేపీ స్ట్రాటజీ ప్లాన్ వర్కవుట్ చేస్తోంది. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన సన్నాహక కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఇదిలా ఉంటే గతంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కూటమిలో భాగంగా ఉండీ.. ఆ తరువాత పలు రాజకీయ పరిణామాలతో బీజేపీని వదిలి వెళ్లిన పార్టీలు మళ్లీ బీజేపీ చెంతకు చేరుతున్నాయి. పాత మిత్రులు మళ్లీ బీజేపీకి దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కర్ణాటకలో పాత మిత్రుడు దేవెగౌడ పార్టీ జేడీఎస్, నరేంద్రమోడీకి మద్దతు ప్రకటిస్తోంది. ఇక ఏపీలో టీడీపీ కూడా ఎన్డీయే కూటమికి దగ్గర కావడానికి ప్రయత్నిస్తోంది.
గతంలో పంజాబ్ రాష్ట్రంలో అధికారంలో ఉండీ, ఎన్డీయే కూటమిలో చక్రం తిప్పిన అకాళీదళ్ ఇటీవల కాలంలో ఆమ్ ఆద్మీ పార్టీ దెబ్బకు కకావికలం అయింది. రైతు ఉద్యమ సమయంలో ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన అకాళీదళ్ కు పొలిటికల్ మైలేజ్ కూడా లభించలేదు. పంజాబ్ లో 2019 ఎన్నికల్లో అకాళీదళ్ 10, బీజేపీ 3 స్థానాల్లో పోటీ చేశాయి. అయితే ఈ సారి కూడా ఇదే స్థాయిలో సీట్ల పంపకం జరిగితే ఇరు పార్టీల మధ్య పొత్తు ఉండే అవకాశం ఉందని ఇరు పార్టీల నేతలు చెప్పుకుంటున్నారు.
Read Also: Nitish Kumar: మళ్లీ ఎన్డీయేలోకి నితీష్ కుమార్..? వరస భేటీలతో ఊహాగానాలు..
వ్యవసాయ చట్టాల రద్దు తర్వాత జరిగిన పంజాబ్ ఎన్నికల్లో ఆప్ దెబ్బకు అకాళీదళ్ పత్తా లేకుండా పోయింది. రెండు దశాబ్ధాలుగా అకాలీదళ్, బీజేపీ కూటమి విచ్ఛిన్నం కావడం అక్కడ ఆప్ కు ప్లస్ గా మారింది. ఈ నేపథ్యంలో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో రెండు పార్టీలు పొత్తు కూడాలని అనుకుంటున్నాయి. ఇటీవల అకాలీదళ్ నేత ప్రకాష్ సింగ్ బాదల్ చనిపోయిన సమయంలో ప్రధాని నివాళులు అర్పించేందుకు చంఢీగడ్ వెళ్లారు. ఆయనను సోదరుడని సంభోదించారు. ఆ సమయంలోనే ఇరు పార్టీల మధ్య పొత్తు ఉండొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి.
2019 ఎన్నికల్లో పంజాబ్ లోని 13 ఎంపీ స్థానాల్లో 8 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంటే.. బీజేపీ, అకాళీదల్ చెరో రెండు స్థానాల్లో, ఆప్ ఒక స్థానంలో విజయం సాధించాయి. అయితే 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఇరు పార్టీలు విడిపోయి దెబ్బతిన్నాయి. ఆప్ 42 శాతం ఓట్లతో అగ్రస్థానంలో నిలవగా, కాంగ్రెస్ 22.98 శాతం, ఎస్‌ఏడీ 18.38 శాతం, బీజేపీ 6.60 శాతం ఓట్ల పొందాయి. 2019 లోక్ సభ ఎన్నికల్లో అకాలీ దళ్ కి 27.8 శాతం ఓట్లు వస్తే, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం 18.38 శాతానికి పడిపోయింది. ఈ రెండు పార్టీలు మళ్లీ కలిసి పోటీ చేద్ధాం అని అనుకుంటున్నాయి.