LAC Border truce: 2020 గల్వాన్ ఘర్షణ తర్వాత భారత్-చైనా సరిహద్దుల వెంబడి ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. ఇటీవల ‘‘లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్(ఎల్ఏసీ)’’ వెంబడి దీర్ఘకాలంగా ఉన్న ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు భారత్, చైనాలు సరిహద్దు సంధిని కుదుర్చుకున్నాయి. లఢక్ ప్రాంతంలో సరిహద్దు ఉద్రిక్తతలు ఉన్న ప్రాంతాల నుంచి ఇరు దేశాల సైన్యం వెనక్కి వెళ్లేందుకు అంగీకరించాయి.
Read Also: NIA: ఉగ్రవాదంపై ఉక్కుపాదం.. 5 రాష్ట్రాల్లో 19 చోట్ల ఎన్ఐఏ దాడులు..
ఇదిలా ఉంటే, ఈ అంశాలపై చర్చించేందుకు జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఏస్ఏ) అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో సమావేశం కానున్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు కారణమైన డెప్సాంగ్, డెమ్‌చోక్ ప్రాంతాల్లో ఇటీవల ఇరు సైన్యాలు వెనక్కి వెళ్లిన నేపథ్యంలో ఈ సమావేశం జరగబోతోంది.
డిసెంబర్ చివరలో ప్రత్యేక ప్రతినిధి( ఎస్ఆర్) చర్చలు షెడ్యూల్ చేయబడ్డాయి. 2020 గల్వాన్ ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య జరిగే ఉన్నత స్థాయి సమావేశం ఇదే. అంతకుముందు 2019 డిసెంబర్‌లో ఎస్ఆర్ మీటింగ్ జరిగింది. ఈ చర్చలు శాశ్వత పరిష్కారాన్ని సాధించే లక్ష్యంతో ఉంది. ఎల్ఏసీని మరింత స్పష్టంగా నిర్వచించడం, వివరించే లక్ష్యంతో బహుళ స్థాయి చర్చలు ఉంటాయని భావిస్తున్నారు. ఈ చర్చల తర్వాత కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు జరగనున్నాయి. ఇది ఇరు దేశాల మధ్య తదుపరి ఘర్షణల్ని నివారించేందుకు కొనసాగుతున్న పెట్రోలింగ్, బఫర్ జోన్‌లకు సంబంధించిన కార్యాచరణ సమస్యలపై దృష్టి పెడుతుంది.