దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార పక్షానికి చెందిన అభ్యర్థి ఎవరు..? అనే అంశంపై చర్చ హాట్ టాపిక్‌గా సాగుతోంది.. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా పలువురు పేర్లు ప్రచారంలో ఉండగా.. అందులో జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న అజిత్ దోవల్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చినట్టుగా తెలుస్తోంది.. జాతీయ భద్రతా సలహాదారుగా దేశానికి ఎంతో సేవ అందించిన అజిత్ దోవల్‌ను రాష్ట్రపతిని చేయాలని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి భావిస్తున్నట్టు సమాచారం..
Read Also: Karamam Dharmasri: టీచర్ ఉద్యోగం సంపాదించిన వైసీపీ ఎమ్మెల్యే
రాష్ట్రపతి అభ్యర్థిని నిర్ణయించేందుకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనున్న నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో హోంమంత్రి అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్, జేపీ నడ్డా చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది.. అయితే, ఆ తర్వాత అజిత్ దోవల్ పేరు తెరపైకి వచ్చినట్టుగా ప్రచారం సాగుతోంది.. అయితే, అధికార కూటమికి చెందిన అభ్యర్థి కొత్త రాష్ట్రపతి ఎన్నిక లాంఛనమే అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది.. అధికార పార్టీకి ఎలక్ట్రోరల్ కాలేజీలో 48 శాతానికిపైగా మద్దతు ఉంది. దీంతో దాదాపు అధికారపార్టీ అభ్యర్థే విజయం సాధించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన అజిత్ దోవల్.. భారత నిఘా, శాంతిభద్రతల అధికారిగా పనిచేశారు.. ప్రస్తుతం జాతీయ భద్రతా సలహాదారుగా.. ప్రధాని నరేంద్ర మోడీ టీమ్‌లో కీలకంగా ఉన్నారు.. 2004-05 కాలంలో ఇంటిలిజెన్స్ బ్యూరోకు డైరెక్టర్ గా పనిచేశారు, అంతకు ముందు దాదాపుగా దశాబ్ది కాలం ఆ సంస్థ కార్యకలాపాల విభాగానికి అధిపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1968 బ్యాచ్ కేరళ క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన ఆయన సొంత రాష్ట్రం ఉత్తరాఖండ్. 23 ఏళ్లకే ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. తండ్రి సైన్యంలో పనిచేయడంతో అజ్మీర్‌లోని రాష్ట్రీయ మిలటరీ స్కూల్లో చదువుకున్నారు. ఆపైన ఆగ్రా యూనివర్సిటీ నుంచి అర్థశాస్త్రంలో పీజీ చేశారు దోవల్. ఇక, సర్వీసులో చేరిన నాలుగేళ్లకు ఇంటెలిజెన్స్ బ్యూరోకు మారారు దోవల్. అక్కడ పనిచేస్తూ సరిహద్దు రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేక శక్తుల పీచమణిచే చర్యల్లో కీలకంగా పనిచేశారు.. తన సర్వీసులో ఎక్కువ సమయం అజ్ఞాతంలోనే ఉండి సేవలు అందించారు.
రక్షణ రంగంలో వివిధ ఆపరేషన్లలో కీలక భూమిక పోషించిన అజిత్ దోవల్‌ను.. నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ)గా నియమించారు. . వివిధ ఆపరేషన్లలో క్షేత్రస్థాయి అనుభవం ఉన్న మొదటి ఎన్‌ఎస్‌ఏ అయిన దోవల్‌కి చేతల మనిషిగా గుర్తింపు ఉంది.. మటలు తక్కువగా మాట్లాడే ఆయన.. చేతల్లో చూపిస్తారని చెబుతుంటారు.. దోవల్ దెబ్బకే దావూద్ ఇబ్రహీం తన స్థావరాన్ని కరాచీ నుంచి పాక్-అఫ్గాన్ సరిహద్దుల్లోకి మార్చుకున్నాడనీ చెబుతుంటారు.. రా, ఇంటెలిజెన్స్ బ్యూరోలు సేకరించిన సమాచారాన్ని జాతీయ భద్రతా సలహాదారుతోనే పంచుకుంటాయి. దాన్నిబట్టి ఎన్‌ఎస్‌ఏగా దోవల్ పాత్ర ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.. ఎన్‌ఎస్‌ఏగా బాధ్యతలు చేపట్టిన రెండు నెలలకే ఇరాక్‌లో ఐసిస్ దాడుల్లో చిక్కుకున్న 45 మంది భారతీయ నర్సుల్ని క్షేమంగా స్వదేశానికి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు దోవల్.
ఇక, మణిపూర్‌లో ఇండియన్ ఆర్మీకి సంబంధించిన వాహనశ్రేణిపైన దాడిచేసి 18 మంది సైనికుల్ని తీవ్రవాదులు మట్టుబెట్టిన తర్వాత ప్రతీకారంగా వారాల వ్యవధిలో మన సైన్యం మయన్మార్‌లోకి వెళ్లి మెరుపుదాడి చేసి 40 మంది తీవ్రవాదుల్ని హతమార్చింది. గత అక్టోబరులో మయన్మార్ ప్రభుత్వం అతివాద వర్గాలతో శాంతి ఒప్పందం చేసుకున్నపుడు దోవల్ అక్కడే ఉండి ఆ కార్యక్రమాన్ని పరిశీలించారు.. ఊరీ తీవ్రవాద దుశ్చర్య తర్వాత మొట్టమొదటిసారిగా భారత దళాలు నియంత్రణ రేఖను దాటి పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులను విజయవంతంగా జరిపాయి.. ఈ మెరుపు దాడుల వెనుక సూత్రధారిగా అజిత్ ధోవల్ ప్రధానపాత్ర పోషించారు. అప్పటి నుంచి ప్రధాని నరేంద్ర మోడీకి మరింత చేరువయ్యారు దోవల్.. మొత్తంగా ఇప్పుడ ఆయనను భారత రాష్ట్రపతిని చేసేందుకు అధికార పక్షం మొగ్గుచూపుతున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.