వైసీపీ ఎమ్మెల్యే ప్రభుత్వ టీచర్ ఉద్యోగం సంపాదించారు. 1998లో డీఎస్సీ రాసిన ఆయన ఎట్టకేలకు ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు.
1998 డీఎస్సీ పోస్టింగుల కోసం అభ్యర్థులు సుమారు 23 ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. 1998 డీఎస్సీపై కోర్టులో కేసులు
పెండింగ్‌లో ఉండటంతో ఇన్నాళ్లూ పోస్టింగులు వాయిదా పడుతూ వచ్చాయి. తాజాగా వివాదాలు పరిష్కారం కావడంతో సీఎం జగన్
1998 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాల కేటాయింపు ఫైలుపై సంతకం చేశారు. ఉద్యోగానికి ఎంపికైన వారి జాబితాలో వైసీపీ ఎమ్మెల్యే కరణం
ధర్మశ్రీ పేరు కూడా ఉంది.
బీఏ సోషల్, ఇంగ్లీష్ పోస్టుకు కరణం ధర్మశ్రీ 1998లో డీఎస్సీ రాశారు. అయితే కోర్టులో వివాదాల కారణంగా పోస్టింగులు రాలేదు. దీంతో అభ్యర్థులు కొందరు కూలీలుగా మారగా.. మరికొందరు వేర్వేరు వృత్తుల్లో స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలో కరణం ధర్మశ్రీ కూడా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా కూడా విజయం సాధించారు. 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున మాడుగుల ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా విజయకేతనం ఎగురవేశారు.
తాజాగా టీచర్ ఉద్యోగం రావడంపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ.. డీఎస్సీ రాసినప్పుడు తన వయసు 30 సంవత్సరాలు అని గుర్తు చేసుకున్నారు. మద్రాసు అన్నామలై యూనివర్సిటీలో బీఈడీ చదివానని, ఉపాధ్యాయుడిగా స్థిరపడాలని భావించానని తెలిపారు. అయితే 1998 డీఎస్సీ వివాదాల్లోకి జారుకోవడంతో ఆ తర్వాత బీఎల్ అభ్యసించినట్లు పేర్కొన్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరి జిల్లా యువజన విభాగంలో పనిచేసినట్లు వివరించారు. ఒకవేళ 1998లోనే తనకు ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చి ఉంటే రాజకీయాల్లోకి వచ్చి ఉండేవాడిని కాదని స్పష్టం చేశారు.