Ajit Doval: పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో ప్రతీకారం తీర్చుకుంది. పీఓకే, పాకిస్తాన్‌లోని మొత్తం 09 ఉగ్రస్థావరాలపై 24 దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాదులు పదుల సంఖ్యలో మరణించారు. అయితే, ఈ దాడుల గురించి జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ ప్రపంచదేశాలకు వివరించారు. భారతదేశానికి ఉద్రిక్తతల్ని పెంచే ఉద్దేశ్యం లేదని, ఒక వేళ పాకిస్తాన్ దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, దృఢంగా ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు మిత్ర దేశాలకు వెల్లడించారు.
Read Also: Operation Sindoor: శభాష్ భారత సైన్యం.. చిటికెడు సింధూరం ఎంత విలువైందో పాకిస్థాన్‌కు అర్థమైంది?
పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లో ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఎటాక్ చేసిన తర్వాత, అజిత్ దోవల్ యూకే, యూఎస్, సౌదీ అరేబియా, జపార్, రష్యా, ఫ్రాన్స్‌లతో మాట్లాడారు. తాము ఉగ్రవాద స్థావరాలను మాత్రమే టార్గెట్ చేశామని, సామాన్య ప్రజలు, పాక్ ఆర్మీ ఆస్తులపై దాడులు నిర్వహించలేదని తెలిపారు. భారత్ తీసుకున్న చర్యలు, అమలు చేసిన విధానం గురించి దోవల్ తన సహచరులతో పంచుకున్నారు.
భారత్‌కు ఘర్షణను పెంచే ఉద్దేశ్యం లేదని, కానీ పాకిస్తాన్ తీవ్ర తరం చేయాలనుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. దోవల్ అమెరికా ఎన్ఎస్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, యూకే జోనాథన్ పావెల్, సౌదీ అరేబియా ఎన్ఎస్ఏ ముసైద్ అల్ ఐబాన్, యూఏఈ అధికారి షేక్ తహ్నూన్, జపాన్ అధికారి మసటాకా ఒకానోలతో మాట్లాడారు. చైనా సీపీసీ సెంట్రల్ కమిటీ పోలిట్ బ్యూరో సభ్యుడు, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి, ఫ్రెంచ్ అధ్యక్షుడి దౌత్య సలహాదారు ఇమ్మాన్యయేల్ బోనేతో మాట్లాడారు.