Air India plane crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఘోర విషాదాన్ని నింపింది. లండన్ వెళ్తున్న ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం గురువారం మధ్యాహ్నం కుప్పకూలింది. టేకాఫ్ అయిన 33 క్షణాల్లోనే కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది మరణించారు. ఒక్కరు మాత్రమే ప్రాణాలతో మిగిలారు. ఫ్లైట్ మెడికల్ హాస్టల్ పై కూలిపోవడంతో 24 మంది మెడికోలు మరణించారు.
అయితే, క్షణాల్లోనే విమానం ఎలా కూలిపోయిందనే దానిపై పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చివరి క్షణాల్లో విమానాన్ని రక్షించేందుకు కాక్‌పిట్‌లో పైలట్లు ఎలాంటి చర్యలు చేపట్టారనే దానిపై అంచనా వేస్తున్నారు. విమానం కూలిపోతున్న సమయంలోని విజువల్స్ ఇప్పటికే వైరల్‌గా మారాయి. వీటిని చూసిన నిపుణులు ఏం జరిగిందనే దానిపై ఒక అంచనాకు వచ్చారు.
Read Also: PM Modi: మృత్యుంజయుడు రమేష్‌ను ప్రత్యేకంగా పలకరించిన మోడీ
టేకాఫ్ అయ్యేందుకు కావాల్సిన శక్తి ఇంజన్ల నుంచి రాలేదని స్పష్టంగా తెలుస్తోంది. ఇంజన్లు కావాల్సిన థ్రస్ట్‌ని ఉత్పత్తి చేయలేకపోయాయి. పైలట్లు విమానాన్ని పైకి తీసుకెళ్లేందుకు, లిఫ్ట్ ఫోర్స్ పొందేందుకు శాయశక్తుల ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో పైలట్లు యోక్‌ని లాగుతూ, విమానం ముక్కు భాగాన్ని పైకి వెళ్లేలా చేసి ఉంటారని నిపుణులు చెబుతున్నారు. టేకాఫ్ తర్వాత పైలట్లు మేడే కాల్ చేసి, ఎమర్జెన్సీని ప్రకటించారు.
లిఫ్ట్ లేకపోవడం, ల్యాండింగ్ గేర్లను కూడా పైలట్లు ఉపసంహరించుకోలేదు. ల్యాండిగ్ గేర్ విమానం బయటే ఉంది. అప్పటికే విమానం క్రమంగా తన ఎత్తును కోల్పోతూ వచ్చింది. టేకాఫ్ సమయంలో విమానం సాధించాల్సిన గరిష్ట వేగం 174 నాట్స్, అయితే, ఇంజన్లు తగినంత శక్తిని ఉత్పత్తి చేయలేదని విజువల్స్ చూస్తే తెలుస్తోందని నిపుణులు చెబుతున్నారు. టేకాఫ్ బాగానే ఉన్నప్పటికీ, విమానం కిందకు దిగుతున్నట్లు కనిపిస్తోంది. ఇది ఇంజన్లు ఫెయిల్యూర్ అయినప్పుడే జరుగుతుందని పలువురు సీనియర్ పైలట్లు చెబుతున్నారు.