Air India modifies in-flight alcohol service policy: ఇటీవల ఎయిరిండియా విమానంలో జరిగిన మూత్రవిసర్జన సంఘటన దేశ ఏమియేషన్ రంగంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శంకర్ మిశ్రా అనే వ్యక్తి మద్యం సేవించి ఓ సీనియర్ మహిళా ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన చేశాడు. దీంతో ఈ ఘటనపై డీజీసీఏ కీలక ఆదేశాలు జారీచేసింది. విమానంలో ప్రయాణికులు వికృత చర్యలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదానిపై మార్గదర్శకాలు విడుదల చేసింది.
Read Also: JNU: జెఎన్‌యూలో మోదీ డాక్యుమెంటరీ రగడ.. ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐల మధ్య ఉద్రిక్తత
ఇదిలా ఉంటే ఈ ఘటనతో అబాసుపాలైన ఎయిర్ ఇండియా తన ఆల్కాహాల్ పాలసీని సమరించుకుంది. క్యాబిన్ సిబ్బంది అవసరమైతే ఆల్కాహాల్ అందించేందుకు నిరాకరించాలని తెలిపింది. జనవరి 19న తీసుకువచ్చిన కొత్త పాలసీలో భాగంగా.. క్యాబిన్ సిబ్బంది అందిస్తే తప్పా.. ప్రయాణికులు మద్యం తాగడానికి అనుమతించ కూడదని.. ప్రయాణికులు తమ సొంత ఆల్కాహాల్ సేవించే వారిపై శ్రద్ధ వహించాలని సూచించింది. ప్రయాణికులు ఎవరైనా మరింత మద్యాన్ని డిమాండ్ చేస్తే సున్నితంగా తిరస్కరించాలని సూచించింది. మద్యం ఎక్కువైన సమయంలో ఇక మద్యం ఇవ్వం అని చెప్పొచ్చని.. వారిని తాగుబోతు అని పిలవకూడదని తెలిపింది.
ప్రయాణికుల పట్ల సిబ్బంది మర్యాదపూర్వకంగా ఉండాలని, ప్రయాణికులతో క్యాబిన్ సిబ్బంది తమ స్వరాన్ని పెంచి మాట్లాడవద్దని తెలిపింది. ఆనందం కోసం మద్యం తాగడం, మత్తు కోసం మద్యం తాగడం మధ్య వ్యత్యాసం ఉందని వెల్లడించింది. ఇటీవల రెండు సంఘటనల్లో మద్యం కారణంగా ఎయిర్ ఇండియా ఆరోపణలు ఎదుర్కొంది. న్యూయార్క్-ఢిల్లీ ఎయిరిండియా విమానంలో మూత్రవిసర్జన ఘటన జరిగింది. దీని తర్వాత పారిస్-న్యూ ఢిల్లీ విమానంలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. దీంతో విమానంలో మద్యం అందించే విధానాన్ని ఎయిరిండియా సవరించుకుంది.