తమిళనాడులో మళ్లీ అన్నాడీఎంకే-బీజేపీ మధ్య పొత్తు చిగురుస్తున్నట్లు కనిపిస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో రెండు పార్టీలు విడివిడిగానే పోటీ చేశాయి. దీంతో రెండు పార్టీలు ఘోరంగా దెబ్బతిన్నాయి. తిరిగి రెండు పార్టీల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నట్లుగా కనిపిస్తోంది. దీనికి అన్నామలై చేసిన సానుకూల వ్యాఖ్యలే కారణంగా తెలుస్తోంది.
సెప్టెంబర్ 2023లో ఎన్డీఏ నుంచి అన్నాడీఎంకే బయటకు వచ్చేసింది. అంతకముందు రెండు పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగాయి. దీంతో బీజేపీతో పొత్తు ఉండదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి ఇటీవల ప్రకటించారు. అయితే బీజేపీ రాష్ట్ర చీఫ్ అన్నామలై యూకే పర్యటన తర్వాత అతని స్వరంలో మార్పు కనిపించింది. అన్నాడీఎంకేతో పొత్తుపై త్వరలో క్లారిటీ వస్తుందని వ్యాఖ్యానించారు. తమిళనాడులో డీఎంకేను గద్దె దించడమే తమ ప్రాధాన్యత అని చెప్పుకొచ్చారు. మళ్లీ కూటమి ఏకమవుతుందా? అంటే మాత్రం ఇవన్నీ అవకాశాలేనని తెలిపారు. 2025 నాటికి మాత్రం ఒక స్పష్టత రావొచ్చని అన్నామలై పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Formula E-Car Case: కేటీఆర్ పై ఈడీ కేసు నమోదు..
అన్నాడీఎంకే నేతలపై, జయలలితపై అన్నామలై చేసిన వ్యాఖ్యలు కారణంగానే రెండు పార్టీలు విడిపోయాయి. అప్పటి వరకూ కలిసి పోటీ చేసిన పార్టీలు.. 2024 లోక్‌సభ ఎన్నికల సమయానికి విడిపోయాయి. ఫలితంగా బీజేపీకి ఒక్క సీటు కూడా రాలేదు. భారీగా నష్టాన్ని చవిచూసింది. ఈ నేపథ్యంలోనే మరోసారి రెండు పార్టీలు కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు జాతీయ స్థాయిలో చర్చ నడుస్తోంది. అన్నాడీఎంకే మాత్రం సయోధ్య కుదిరే అవకాశాలను తీవ్రంగా తోసిపుచ్చింది. ఏఐఏడీఎంకే సీనియర్ అధికార ప్రతినిధి కోవై సత్యన్ మాట్లాడుతూ.. బీజేపీతో పొత్తు లేదని ప్రధాన కార్యదర్శి పళనిస్వామి ఇప్పటికే స్పష్టం చేశారన్నారు. మహారాష్ట్రలో శివసేనకు ఏం జరిగిందో తమకు తెలుసు అన్నారు.
ఇది కూడా చదవండి: Pushpa 2: అల్లు అర్జున్ కి మరో షాక్.. హ్యూమన్ రైట్స్ కి ఫిర్యాదు