Justin Trudeau: కెనడా ప్రధాని తన తీరు మార్చుకోవడం లేదు. ఇంటాబయట విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ.. భారత వ్యతిరేక వైఖరి వీడటం లేదు. ఇప్పటికే ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత ఇందులో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని వివాదాస్పద ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు కారణంగా ఇరు దేశాల మధ్య ఎప్పుడూ లేనంతగా దౌత్యవివాదం చెలరేగింది. అయితే ఈ వ్యాఖ్యలకు ఆరోపణలు చూపించాల్సిందిగా ఇండియా కోరితే మాత్రం అటు నుంచి స్పందన రావడం లేదు.
తాజాగా ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కడం మానడం లేదు. ఇటీవల ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో జోర్డాన్ రాజు అబ్దుల్లా-2 బిన్ అల్-హుస్సేన్‌తో మాట్లాడారు. కెనడా, భారత్ మధ్య పరిస్థితులను గురించి, జోర్డాన్ రాజుకు ట్రూడో వివరించాడు. న్యాయపాలన, దౌత్య సంబంధాలపై వియన్నా కన్వెన్షన్‌ని గౌరవించాలని నొక్కి చెప్పాడని ట్రూడో కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
Read Also: Minister Srinivas Goud: ప్రజలు నా వైపే ఉన్నారు.. మళ్లీ గెలుపు నాదే: మంత్రి శ్రీనివాస్ గౌడ్
అంతకు ముందు యూఏఈ అధ్యక్షుడు మొహ్మద్ బిన్ జాయెద్ తో కూడా ఇలాగే భారత ప్రస్తావనను తీసుకువచ్చాడు ట్రూడో. భారత దేశం రూల్ ఆఫ్ లాని పాటించాలని ప్రస్తావించాడు. ‘‘ఈ రోజు ఇజ్రాయిల్ పరిస్థితిపై మాట్లాడాము. మేం దీనిపై ఆందోళన వ్యక్తం చేశాము.. పౌర జీవితాలను రక్షించాల్సి అవసరం గురించి చర్చించాము. భారతదేశం గురించి చర్చించాం. చట్టపాలన ప్రాముఖ్యతను గురించి మాట్లాడాము’’ అని ఆదివారం ట్రూడో ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశాడు.
హర్దీప్ సింగ్ నిజ్జర్ ని కెనడాలోని సర్రేలో జూన్ నెలలో గుర్తుతెలియన వ్యక్తులు కాల్చి చంపారు. అయితే ఈ హత్యలో భారత ప్రమేయం ఉందని కెనడా ప్రధాని ట్రూడో అక్కడి పార్లమెంట్ లో వ్యాఖ్యానించడం వివాదాస్పదం అయింది. సీనియర్ భారత దౌత్యవేత్తను కెనడా నుంచి బహిష్కరించారు. భారత్ కూడా ఇందుకు ప్రతిగా సీనియర్ కెనడియన్ దౌత్యవేత్తను ఇండియా నుంచి వెళ్లాల్సిందిగా ఆదేశించింది. కెనడా వ్యాఖ్యల్ని భారత్ అసంబద్ధ, రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలుగా విమర్శించింది. కెనడా ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని భారత విదేశాంగ శాఖ ధ్వజమెత్తింది.