Sanjay Raut: ప్రధాని నరేంద్రమోడీ టార్గెట్‌గా శివసేన ఠాక్రే వర్గం నేత సంజయ్ రౌత్ విరుచుకుపడుతున్నారు. మోడీ సెప్టెంబర్‌లో రిటైర్ అవుతారని, అందుకే ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వచ్చారని వ్యాఖ్యానించిన ఆయన ఈ రోజు మరిన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం రౌత్ మాట్లాడుతూ.. మోడీ కేవలం తాత్కాలిక ఏర్పాటు మాత్రమే అని, ఎవరికి బాస్ కాదని అన్నారు. దశాబ్దాలుగా పనిచేసిన అద్వానీ వంటి అగ్ర నేతల కారణంగా బీజేపీ అధికార శిఖరానికి చేరుకుందని అన్నారు.
Read Also: Bengaluru: విద్యార్థి తండ్రితో టీచర్ ఎఫైర్.. చివరికి ఏమైందంటే..!
రౌత్ మాట్లాడుతూ.. ‘‘ఎవరికి ఎవరు బాస్..? మోడీ ప్రధాని కావడం తాత్కాలిక ఏర్పాటు. రాముడు, కృష్ణుడు కూడా తమ పని పూర్తి చేసిన తర్వాత వెళ్లిపోయారు. మోడీ ప్రధానమంత్రి అయినప్పుడు షాజహాన్ లాగా అద్వానీని దూరం ఉంచారు. ’’ అని ఔరంగజేబు రాజు అయిన తర్వాత షాజహాన్‌ని బంధించిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రిగా అద్వానీకి హక్కు ఉంది, కానీ మొఘల్ తరహాలో అధికారం చేపట్టినట్లుగానే ఆయనను పక్కన పెట్టారని అన్నారు.
వారసుడిని నిర్ణయించడం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చేతుల్లో లేదని రౌత్ అన్నారు. ‘‘మోడీకి సెప్టెంబర్లో 75 ఏళ్లు నిండుతాయి. పార్టీ నియమం ప్రకారం ఆయన పదవీ విరమణ చేయాలి. నరేంద్రమోడీ తన పార్టీలో 75 ఏళ్లు దాటిన వారికి పదవి ఉండదనే నియమాన్ని స్వయంగా ప్రవేశపెట్టారు. ఈ నియమాన్ని ఎల్‌కే అద్వానీకి, మురళీ మనోహర్ జోషి వంటి నాయకులకు వర్తింపచేశారు’’ అని రౌత్ అన్నారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ మాతృసంస్థ అని, వారి భవిష్యత్తు మార్గాన్ని నిర్ణయిస్తుందని చెప్పారు. వక్ఫ సవరణ బిల్లుపై మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్, అప్నాదళ్ వంటి ఎన్డీయే మిత్రపక్షాలు బిల్లుపై ఒక వైఖరి తీసుకోవాలని, ఆ తర్వాతే ఇతర పార్టీలను అడగాలని అన్నారు.