Pakistan: ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరతలతో పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతోంది. ఆ దేశంలో ప్రభుత్వం ఉన్నా.. లేని విధంగా తయారైంది అక్కడి పరిస్థితి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, పాక్ ప్రభుత్వం, సైన్యంపై తిరుగుబాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతీ రోజూ అక్కడ ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఇదిలా ఉంటే బలూచిస్తాన్, ఖైబర్ ఫక్తుంఖ్వా ప్రాంతాల్లో వేర్పాటువాదం పెరిగింది. ఇన్ని సమస్యల మధ్య పాకిస్తాన్ బతుకీడుస్తోంది.
ఇదిలా ఉంటే రాబోయే రోజుల్లో పాకిస్తాన్ లో తీవ్రమై ఆహార సంక్షోభం తప్పదని ఐక్యరాజ్యసమితి ఓ నివేదిక వెల్లడించింది. దేశంలో ఆర్థిక మరియు రాజకీయ గందరగోళం తీవ్రమైతే, పాకిస్తాన్‌లో రాబోయే నెలల్లో తీవ్రమైన ఆహార అభద్రత పెరిగే అవకాశం ఉందని సోమవారం విడుదల ఈ నివేదిక వెల్లడించింది. ‘హంగర్ హాట్‌స్పాట్‌లు: FAO-WFP ఎర్లీ వార్నింగ్ అన్ సివియర్ ఫుడ్ ఇన్ సెక్యూరిటీ ‘ పేరుతో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) , వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ (WFP) సంయుక్తంగా ఈ నివేదికను విడుదల చేశాయి.
Read Also: North Korea: సముద్రంలో కుప్పకూలిన నార్త్ కొరియా స్పై శాటిలైట్..
ప్రస్తుత ఆర్థిక మాంద్యం పరిస్థితుల మధ్య పెరుగుతున్న రుణాలు, నిత్యవసరాల ధరలు దీర్ఘకాలిక ఆర్థిక సంక్షోభాన్ని తీవ్రం చేశాయని నివేదిక తెలిపింది. ఏప్రిల్ 2023- జూన్ 2026 మధ్య కాలంలో పాకిస్తాన్ ప్రభుత్వం 77.5 బిలియన్ డాలర్ల రుణాలను చెల్లించాల్సి ఉందని పేర్కొంది. మరోవైపు ఐఎంఎఫ్ నుంచి ప్యాకేజీ కోసం ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ ప్రయత్నాలను రాజకీయ అస్థిరత మరింతగా నిరోధిస్తోందని తెలిపింది. దేశంలోని వాయువ్య ప్రాంతంలో అస్థిరత పెరుగుతున్నందున, అక్టోబర్ 2023 జాతీయ ఎన్నికలకు ముందు రాజకీయ సంక్షోభం, దేశంలో అశాంతి తీవ్రం అవుతుందని అంచాన వేసింది. విదేశీ నిల్వలు లేకపోవడం, క్షీణిస్తున్న కరెన్సీ దేశంలో కీలమైన ఆహారం, ఇంధనాన్ని దిగుమతి చేసుకునే సామర్థ్యాన్ని తగ్గిస్తుందని, ఆహార ఖర్చులు పెరగడంతో దేశవ్యాప్తంగా ఇబ్బందులు తలుత్తాయని అంది.
జూన్ నుంచి నవంబర్ 2023 వరకు 22 దేశాల్లో తీవ్ర ఆహార సంక్షోభం పెరిగే అవకాశం ఉంది. పాకిస్తాన్ తో పాటు ఆఫ్ఘనిస్తాన్, నైజీరియా, సోమాలియా, దక్షిణ సూడాన్, యెమెన్, హైతీ, బుర్కినా ఫాసో, మాలి, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, ఇథియోపియా, కెన్యా, కాంగో, సిరియా, మయన్మార్ వంటి దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి.