ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి కేసులో నిందితుడు రాజేష్ సకారియా పోలీస్ విచారణలో వింతైన విషయాలు వెల్లడించాడు. తాను శివుని భక్తుడినని సకారియా చెప్పుకొచ్చాడు. వీధి కుక్కల విషయంలో తనను ఢిల్లీ వెళ్లి ముఖ్యమంత్రి సహాయం కోరమని శివుడు చెప్పాడని పేర్కొన్నాడు. వీధి కుక్కలను తొలగించొద్దని రేఖా గుప్తాను కోరితే పట్టించుకోలేదన్నాడు. అందుకే ఆమెపై దాడి చేసినట్లుగా చెప్పుకొచ్చాడు. పోలీసులు అతడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Archana Tiwari: నేపాల్ సరిహద్దులో అర్చన తివారీ ప్రత్యక్షం.. మిస్టరీ ఎలా వీడిందంటే..!
ఢిల్లీ వీధుల్లో 8 వారాల్లో వీధి కుక్కలను తొలగించాలని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించింది. తీర్పు అనంతరం పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే గుజరాత్‌కు చెందిన జంతు ప్రేమికుడైన రాజేష్ సకారియాకు కోపం తెప్పించింది. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఉన్న అతడు.. హుటాహుటినా ఢిల్లీకి వచ్చాడు. వీధి కుక్కలను తొలగించొద్దని రేఖా గుప్తాను కోరాడు. బుధవారం ఆమెకు వినతిపత్రం ఇచ్చాడు. అందుకు ఆమె నుంచి రెస్పాన్స్ రాలేదు. దీంతో ఆగ్రహంతో వాగ్వాదానికి దిగాడు. ఆవేశంలో ముఖ్యమంత్రి చెంపపై కొట్టాడు. అంతేకాకుండా దుర్భాషలాడాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
ఇది కూడా చదవండి: MP: మధ్యప్రదేశ్‌లో దారుణం.. ప్రియురాలిని కలిసేందుకు వచ్చిన యువకుడిపై 13 గంటలు దాడి
అయితే సకారియా చెప్పిన దైవిక జోక్య సిద్ధాంతాన్ని ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రా తోసిపుచ్చారు. కుక్కల విషయంలో దైవ జోక్యం ఉండదన్నారు. ఈ సిద్ధాంతం పూర్తిగా తప్పు అని కొట్టిపారేశారు. నిందితుడికి గతంలో నేర చరిత్ర ఉందన్నారు. అతడొక ప్రొఫెషనల్ నేరస్థుడని పేర్కొన్నారు. వాస్తవాల నుంచి దృష్టిని మళ్లించడానికే యాదృచ్ఛిక సిద్ధాంతాలను ముందుకు తెస్తున్నాడని మంత్రి చెప్పుకొచ్చారు. సకారియాపై అనేక కేసులు ఉన్నాయని.. వాటిలో ఎక్కువ భాగం మద్యం అక్రమ రవాణాకు సంబంధించినవి ఉన్నట్లు చెప్పారు. వీటిలో అనేక కేసుల్లో నిర్దోషిగా విడుదలయ్యాడని చెప్పారు. అయితే ఇంకా అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారని.. శారీరకంగా గాయాలు తీవ్రంగా ఉన్నాయన్నారు. సాధారణ స్థితికి రావడానికి సమయం పడుతుందని వెల్లడించారు.
ఇదిలా ఉంటే గుజరాత్ నుంచి టికెట్ లేకుండానే రైల్లో ప్రయాణించినట్లు సకారియా చెప్పాడు. ఢిల్లీ చేరుకున్నాక.. ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఎక్కడ ఉంటారని ప్రజలను వాకబు చేశాడు. అనంతరం మెట్రోలో ప్రయాణం చేశాడు. కానీ వేరే స్టేషన్‌లో తప్పుగా దిగిపోయాడు. అనంతరం షాలిమార్ బాగ్‌లోని ముఖ్యమంత్రి నివాసానికి సైకిల్ రిక్షాలో చేరాడు. ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసి తిరిగి రాత్రి గుజరాత్‌కు వెళ్లిపోవాలని ప్లాన్ చేసుకున్నట్లు సకారియా పోలీసులకు చెప్పాడు. కానీ ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇచ్చి వెంటనే వాగ్వాదం పెట్టుకున్నాడు. దుర్భాషలాడాడు. ప్రస్తుతం సకారియాపై హత్యాయత్నం, విధి నిర్వహణలో ప్రభుత్వ ఉద్యోగిని అడ్డుకున్నందుకు ఇతర సెక్షన్లతో పాటు అనేక అభియోగాలు మోపారు.