ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు ఆప్ ఎమ్మెల్యే అభ్యర్థుల కొనుగోలు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. 16 మంది ఆప్ అభ్యర్థుల కొనుగోలుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్ అధినేత కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. దీంతో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే.సక్సేనా.. ఏసీబీ విచారణకు ఆదేశించారు. దీంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. కేజ్రీవాల్ నివాసానికి చేరుకుని ఏసీబీ అధికారులు నోటీసు ఇచ్చి వెళ్లారు. విచారణకు హాజరుకావాలని కోరారు. ఆరోపణలపై ఆధారాలు సమర్పించాలని కేజ్రీవాల్‌కు విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి: ICC Champions Trophy-2025: ఛాంపియన్స్ ట్రోఫీ థీమ్ సాంగ్ వచ్చేసింది.. (వీడియో)
16 మంది ఆప్ అభ్యర్థులకు బీజేపీ నుంచి ఆఫర్లు వచ్చాయని.. పార్టీ ఫిరాయిస్తే మంత్రి పదవులు.. ఒక్కొక్కరికి రూ.15 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారని ఎక్స్ ట్విట్టర్‌లో కేజ్రీవాల్ ఆరోపించారు. డబ్బులు ఇచ్చి తప్పుడు సర్వేలు చేయిస్తుందని.. అందుకే బీజేపీ గెలుస్తుందంటూ లేనిపోని కథనాలు సృష్టిస్తున్నారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. నిజంగా బీజేపీ గెలిస్తే.. ఆప్ అభ్యర్థులకు ఆఫర్లు ఎందుకు ఇస్తున్నారని నిలదీశారు. కుట్రలో భాగంగా ఫేక్ సర్వేలు చేయిపించి.. ఆప్‌ను విచ్ఛన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు.
ఇది కూడా చదవండి: EC: ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న రాహుల్ గాంధీ.. స్పందించిన ఎన్నికల కమిషన్
ఇదిలా ఉంటే ఆప్ చేసిన ఆరోపణలను బీజేపీ ఖండించింది. పరువు నష్టం కలిగించేవిగా ఉన్నాయని.. ఎన్నికల ఫలితాలకు ముందే పార్టీ ప్రతిష్టను దిగజార్చడమేనని బీజేపీ ధ్వజమెత్తింది.
ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బుధవారం పోలింగ్ జరిగింది. 60 శాతం పోలింగ్ నమోదైనట్లుగా అధికారులు తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ మాత్రం 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారంలోకి రాబోతుందని తెలిపాయి. రేపే ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.