Tamil Nadu: తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్‌ను కొందరు దుండగులు దారుణంగా నరికి హత్య చేశారు. ఈ హత్య కేసుకు సంబంధించి 8 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు విచారణ కొనసాగుతోంది. ఈ విషయాన్ని చెన్నై అదనపు కమిషనర్(నార్త్) అస్రా గార్గ్ వెల్లడించారు. హత్య వెనుక గల కారణాలను తెలుసుకునేందుకు అదుపులోకి తీసుకున్న వారిని క్షుణ్ణంగా విచారిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆర్మ్‌స్ట్రాంగ్‌ను హత్య చేసిన తర్వాత హత్య నిందితులు అక్కడి నుంచి పారిపోతున్నట్లు చూపించే సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది.
Read Also: Akshata Murty: రిషి సునాక్ భార్య డ్రెస్సింగ్‌పై ట్రోలింగ్.. కారణమేంటంటే?
చెన్నైలోని పెరంబూర్ ప్రాంతంలోని ఆయన నివాసం సమీపంలో ఆర్మ్‌స్ట్రాంగ్‌ను ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు నరికి చంపారు. బైకులపై వచ్చిన గుర్తుతెలియని గుంపు ఆర్మ్‌స్ట్రాంగ్‌పై కత్తులతో దాడి చేసి రోడ్డుపై తీవ్రంగా గాయపడినట్లు ప్రాథమిక నివేదికలు పేర్కొన్నాయి. దాడి తరువాత, ఆర్మ్‌స్ట్రాంగ్‌ను నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆర్మ్‌స్ట్రాంగ్ అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. అనంతరం ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజీవ్ గాంధీ జనరల్ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంతాపం వ్యక్తం చేస్తూ, నిందితులను న్యాయస్థానం ముందుకు తీసుకురావాలని పోలీసు అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. “బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య దిగ్భ్రాంతికరం. తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. హత్యలో పాల్గొన్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఆర్మ్‌స్ట్రాంగ్ పార్టీ, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. కేసును త్వరితగతిన నిర్వహించి, చట్టప్రకారం దోషులను శిక్షించాలని పోలీసు అధికారులను ఆదేశించాం.” అని సీఎం స్టాలిన్ ట్వీట్ చేశారు.