Odisha: కోరమాండల్ ఎక్స్ ప్రెస్ దుర్ఘటన మరవకముందే వరసగా ఒడిశాలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బుధవారం గూడ్స్ ట్రైన్ చక్రాల కింద పడి ఆరుగురు కూలీలు మరణించారు. ఉరుములు, మెరుపుతో కూడిన వర్షం నుంచి తప్పించుకునేందుకు ఆరుగురు కూలీలు గూడ్స్ ట్రైన్ కిందకు చేరారు. అయితే ఆ గూడ్స్ ట్రైన్ కు ఇంజిన్ లేదు. ఈ క్రమంలో ఈదురు గాలులు ఎక్కువ కావడంతో, గాలుల ధాటికి గూడ్స్ వ్యాగన్లు కదిలాయి. దీంతో బోగీల కింద ఉన్న ఆరుగురు గూడ్స్ చక్రాల కింద పడి మరణించారు. ఒడిశాలోని ఝాజ్‌పూర్ రైల్వే స్టేషన్ లో ఈ విషాదకర సంఘటన బుధవారం జరిగింది.
బుధవారం రైల్వేకు మతమ్మతులు చేయడానికి కార్మికులు రాగా.. ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. ఈక్రమంలో కూలీలు గూడ్స్ బోగీల కింద తలదాచుకున్నారు. ఈ సమయంలోనే ప్రమాదం జరిగింది. ఆరుగురు కూలీలు మరణించగా, మరికొందరు గాయాలపాలయ్యారు. వీరిని కటక్ లోని ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఇంజిన్ లేకపోవడంతో గాలుల తీవ్రత కారణంగా గూడ్స్ వ్యాగన్లు కదిలినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్ లోనే మరణించాగా..మరో ముగ్గురు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించారు.
ఇటీవల ఒడిశా బాలాసోర్ సమీపంలోని బహనాగ బజార్ రైల్వే స్టేషన్ లో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లూప్ లైన్లో ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. అదే సమయంలో యశ్వంత్ పూర్ ట్రైన్ వేరే ట్రాక్ పై రావడం, ఆ సమయంలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ బోగీలు అదే ట్రాక్ పై పడి ఉండటంతో పెద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 280కి పైగా ప్రయాణికులు మరణిచంగా.. 1200 మంది కన్నా ఎక్కువ మంది ప్రయాణికులు గాయపడ్డారు. మూడు దశాబ్ధాల రైల్వే ప్రమాదాల చరిత్రలో ఇదే అతిపెద్ద ప్రమాదం.