దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నా ఉధృతి ఏ మాత్రం తగ్గడంలేదు. డెల్టా, డెల్టాప్లస్ వేరియంట్లు నమోదవుతున్నాయి. ముఖ్యంగా డెల్టా వేరియంట్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. మొదటి వేవ్‌లో 60 ఏళ్లు పైబడిన వారికి ఎక్కువగా కరోనా సోకగా, సెకండ్ వేవ్‌లో మధ్యవయస్కులు ఎక్కువగా కరోనా బారిన పడ్డారు. కాగా, గత కొన్ని రోజులుగా దేశంలోని వివిధ నగరాల్లో చిన్నారులకు కరోనా సోకుతుండటంతో థర్డ్ వేవ్ మొదలైందనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే మిజోరాం రాష్ట్రం రాజధాని ఐజ్వాల్‌లో చిన్నారులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పుడు దక్షిణ భారత దేశంలోని కర్నాటక రాజధాని బెంగళూరు నగరంలో చిన్నారులకు అధిక సంఖ్యలో కరోనా సోకుతున్నది. గడిచిన వారం రోజుల వ్యవధిలో 500 మంది చిన్నారులకు కరోనా సోకింది. దీంతో బెంగళూరు యంత్రాంగం అప్రమత్తం అయింది. చిన్నారులు కరోనా బారిన పడకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వారం రోజులుగా చిన్నారుల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో పిల్లలు జాగ్రత్తగా ఉండాలని, బయటకు పంపవద్దని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.