Encounter: జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలకు భారీ విజయం దక్కింది. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్(POJK) నుంచి భారత్ లోని జమ్మూ కాశ్మీర్ లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్ లో హతమయ్యారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు జరిపిన జాయింట్ ఆపరేషన్ లో నలుగురు ఉగ్రవాదులను మట్టుపెట్టారు. కుప్వారాలోని మచల్ సెక్టార్ లోని అటవీ ప్రాంతంలో శుక్రవారం ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. పీఓజేకేలోని ఉగ్రవాద లాంచింగ్ ప్యాడ్స్ లో వందల కొద్ది ఉగ్రవాదులు భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే వీరి ప్రయత్నాలను ఆర్మీ, భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు నిర్వీర్యం చేస్తున్నాయి.
Read Also: Lancet study: షాకింగ్ స్టడీ.. 2050 నాటికి 130 కోట్ల మందికి డయాబెటిస్..
జమ్మూకశ్మీర్‌లోని కుప్వారాలోని మచల్ సెక్టార్‌లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి చొరబాటుకు యత్నిస్తున్న నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. పోలీసులు, భారత సైన్యం సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో ఉగ్రవాదులను మట్టుబెట్టారు. గతవారం కూడా కుప్వారాలోని నియంత్రణ రేఖ(ఎల్ఓసీ)కి సమీపంలో ఉన్న జంగుండ్ కెరాన్ వద్ద భారీ చొరబాటు ప్రయత్నాల్ని భద్రతా బలగాలు ఇలాగే అడ్డుకున్నాయి. ఇది జరిగిన వారం తర్వాత తాజా ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది.
పాక్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్, భారత సరిహద్దుల్లో ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్స్ పదుల సంఖ్యలో ఉన్నాయి. వీటిల్లో ఉంటున్న ఉగ్రవాదులు ఆదును చూసి భారత్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరి ప్రయత్నాలను ఆర్మీ ఎప్పటికప్పుడు అడ్డుకుంటుంది. ప్రశాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ లో అలజడులు సృష్టించేందుకు పాక్ ఆర్మీ, ఐఎస్ఐ కనుసన్నల్లో చొరబాట్లు జరుగుతున్నాయి.