నాగాలాండ్ లో గతేడాది మిలిటెంట్లని పొరబడుతూ.. ఆర్మీ కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 13 మంది అమాయక పౌరులు చనిపోయారు. డిసెంబర్ 4, 2021 న నాగాలాంట్ లోని మోన్ జిల్లా ఓటింగ్ లో ఈ ఘటనల జరిగింది. తాజాగా ఈ ఘటనలో సంబంధం ఉన్న ఓ ఆర్మీ అధికారితో పాటు 29 మంది సైనికులపై ఛార్జ్ షీట్ దాఖలైంది. నాగాలాండ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మొత్తం 30 మంది పేర్లను కోర్టుకు సమర్పించింది. ఈ దాడిలో పాల్గొన్న ఆర్మీ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్, ఎంగేజ్మెంట్ నియమాలు పాటించలేదని సిట్ ఆరోపించింది.
ఎన్‌ఎస్‌సిఎన్ (ఖప్లాంగ్)కి చెందిన మిలిటెంట్ల కదలికలపై సమాచారం రావడంతో ఆర్మీ కౌంటర్ ఇన్సర్జెన్సీ యూనిట్, 21 పారా స్పెషల్ ఫోర్సెస్ గాలింపు చేపట్టాయి. మయన్మార్ సరిహద్దు జిల్లా అయిన మోన్ లోని ఓటింగ్ ప్రాంతంతో కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో అప్పుడే బొగ్గు గని నుంచి వస్తున్న కార్మికులు పికప్ ట్రక్ ను చూసి, ఉగ్రవాదులని భావించిన ఆర్మీ వారిపై కాల్పులు జరిపింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 13 మది మరణించారు.
అయితే తాజాగా ఛార్జ్ షీట్ లో పేర్కొన్న సైనికులపై చర్యలు తీసుకునేందుకు నాగాలాండ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ అనుమతిని కోరింది. ఈ సంఘటనల జరిగిన తర్వాత ఈశాన్య రాష్ట్రాల్లో అమలులో ఉన్న సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం(ఏఎఫ్ఎస్పీఏ) మరోసారి చర్చకు వచ్చింది. ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్లు వినిపించాయి.
ఏఎఫ్ఎస్పీఏ చట్టం భద్రతా బలగాలకు విశేష అధికారాన్ని కట్టబెడుతుంది. ఈ చట్టం కింద ఎవరినైనా చంపినట్లయితే భద్రతా బలగాలకు అరెస్ట్, ప్రాసిక్యూషన్ నుమచి మినహాయింపు ఇవ్వడంతో పాటు, ఎవరినైనా ముందస్తు అరెస్టు చేసే అధికారాన్ని కట్టబెడుతుంది. మోన్ జిల్లా ఘటనలో నాగాలాండ్ ప్రభుత్వంతో పాటు ఆర్మీ కూడా విచారణ జరుపుతోంది. మేజర్ జనరల్ నేతృత్వంలోని ఎంక్వైరీ టీం ఇప్పటికే ఓటింగ్ గ్రామాన్ని సందర్శించారు. ఘటనలకు దారి తీసిన పరిస్థితులను అర్థం చేసుకోవడానికి కాల్పులు జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు.