Karnataka Politics: కర్ణాటక పొలిటికల్ డైలామాకు తెరపడింది. సీఎంగా సిద్ధరామయ్య శనివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ఉండనున్నారు. దాదాపుగా 4 రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న చర్చలకు తెరపడింది. అయితే చివరి వరకు తనకు సీఎం పీఠం తప్పా ఏది ఆమోదయోగ్యం కాదని చెబుతున్న డీకే శివకుమార్ ను అధిష్టానం సంతృప్తి పరిచింది. కాంగ్రెస్ పెట్టుకున్న ‘ఒకరికి ఒకే పదవి’ అనే నియమాన్ని కూడా డీకే విషయంలో పక్కకు పెట్టి పీసీసీ చీఫ్ తో పాటు డిప్యూటీ సీఎం అవకాశాన్ని కల్పించింది.
ఇదిలా ఉంటే సిద్దరామయ్య వైపే అధిష్టానం ఎందుకు మొగ్గు చూపిందనే కారణాలు ఇప్పుడు ప్రధానాంశాలుగా మారాయి. నిజానికి కర్నాటకలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి సిద్దరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరు కష్టపడి పనిచేశారు. అయితే సిద్ధరామయ్యకు కొన్ని అంశాలు అనుకూలంగా మారాయి. ఇదిలా ఉంటే డీకేశి మాత్రం ఇటు ప్రభుత్వం, అటు పార్టీపై పట్టునిలుపుకున్నారు.
Read Also: 26/11 Mumbai terror attacks: ముంబై ఉగ్రదాడుల సూత్రధారి తహవూర్ రాణాను భారత్ కు అప్పగించనున్న అమెరికా
1) డీకే శివకుమార్ పై ‘ఆదాయానికి మించిన ఆస్తుల’ కేసు ఉండటం, ఈడీ విచారణను ఎదుర్కోవడం. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం దూకుడు కొనసాగించే అవకాశం ఉంది. 2024 లోక్ సభ ఎన్నికల ముందు డీకేను సీఎం చేస్తే ఈ కేసులు ప్రతిబంధకంగా మారే అవకాశం ఉందని కాంగ్రెస్ భావించింది.
2) సిద్దరామయ్యకు కర్ణాటకలో మాస్ ఫాలోయింగ్ ఉంది. మాస్ లీడర్ గా ఎదిగారు. ఎన్నికల ముందు సీఎంగా ఎవరైతే బాగుంటుందని అడిగితే.. మెజారిటీ కర్ణాటక ప్రజలు సిద్ధరామయ్యకే జై కొట్టారు. ఎమ్మెల్యేల మద్దతు కూడా సిద్దరామయ్యకే ఎక్కువ. దీనికి తోడు సిద్దరామయ్యకు క్లీన్ ఇమేజ్ ఉంది. సాధారణ రైతు కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదిగి సీఎం స్థాయికి ఎదిగారు.
3) డీకే శివకుమార్ వొక్కలిగ వర్గానికి చెందినవారు. ఒక వేళ డీకేకు సీఎం పదవి ఇస్తే.. ఇతర వర్గాల్లో వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఓబీసీ వర్గమైన కురబ కమ్యూనిటీకి చెందిన సిద్దరామయ్యకు ఆ వర్గాల్లో మంచి ఇమేజ్ ఉంది. దీంతో సిద్దరామయ్యకు సీఎం ఇచ్చి, డీకేకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తే అన్ని వర్గాలను సంతృప్తి పరచవచ్చని కాంగ్రెస్ భావించినట్లు తెలుస్తోంది.
4) డీకే శివకుమార్ పార్టీపై పీసీసీ చీఫ్ గా పట్టు నిలుపుకోవడంతో పాటు కీలక మంత్రిత్వ శాఖలు తన దగ్గర పెట్టుకోవడంతో పాటు తన వర్గం నేతలకు కీలక మంత్రి పదవులు ఇప్పించుకోవచ్చు. దీంతో ప్రభుత్వం, పార్టీపై ఆయన పట్టు నిలుపుకోవచ్చు.
5) గతంలో 2013-18 కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలో సీఎంగా ఉన్న సిద్దరామయ్య ఆయన మంత్రివర్గంలో డీకే శివకుమార్ ను తీసుకోవడానికి కూడా నిరాకరించారు. ఈ సారి మాత్రం డీకే రేంజ్ పెరగడంతో అధిష్టానం చేసేది కూడా ఏం లేకపోయింది. 5 ఏళ్లు కర్ణాటకలో సుస్థిర పాలన ఉండాలంటే ఇద్దరు కలిసి పనిచేయాలని ఇరువురు నేతల్ని అధిష్టానం ఒప్పించినట్లు తెలుస్తోంది.