Lahore Declaration: భారత్-పాకిస్తాన్ మధ్య శాంతి కోసం 1999లో అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌లు ‘‘లాహోర్ డిక్లరేషన్’’పై సంతకాలు చేశారు. అయితే, తాజాగా ఈ ఒప్పందం ఉల్లంఘన తమ తప్పే అని పాక్ మాజీ ప్రధాని, అధికార పార్టీ ‘‘పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్(పీఎంఎల్-ఎన్) చీఫ్ నవాజ్ షరీఫ్ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. రెండు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించేందుకు రెండు దేశాలు అంగీకరించిన కొంత కాలానికే పాకిస్తాన్ సైన్యం కార్గిల్ యుద్ధాన్ని ప్రారంభించి, భారత నమ్మకాన్ని వమ్ము చేసింది. అప్పటి పాక్ మిలిటరీ చీఫ్ పర్వేజ్ ముషారఫ్, ప్రధాని నవాజ్ షరీఫ్‌ని సంప్రదించకుండా ఏకపక్షంగా ‘ఆపరేషన్ బదర్’’ పేరుతో కార్గిల్ లోని ఎత్తైన ప్రాంతాలను ఆక్రమించింది.
వాజ్‌పేయి లాహోర్ పర్యటన:
1971 భారత్-పాక్ యుద్ధం తర్వాత ఇరు దేశాలు అణ్వాయుధ శక్తిగా ఎదిగాయి. దీంతో పాటు కాశ్మీర్ వ్యాప్తంగా వేర్పాటువాద సంఘర్షణ ఇరు దేశాల మధ్య సంబంధాలను దిగజార్చింది. సంబంధాలను పునరుద్ధరించాలనే ఆలోచనతో ప్రధాని వాజ్‌పేయి న్యూ ఢిల్లీ మరియు లాహోర్ మధ్య ప్రారంభ బస్సు సర్వీస్‌లో లాహోర్‌ను సందర్శించారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, పాకిస్తాన్ ఆర్మీ వాజ్‌పేయికి ఘన స్వాగతం పలికాయి. లాహోర్ డిక్లరేషన్‌పై ఫిబ్రవరి 21, 1999న జరిగిన చారిత్రాత్మక శిఖరాగ్ర సమావేశం తర్వాత ఇద్దరు నేతలు సంతకం చేశారు.
రెండు దేశాలు మధ్య శాంతి, స్థిరత్వం కోసం, కాశ్మీర్ చుట్టూ ఉన్న అన్ని సమస్యలను శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని ఒప్పందం సూచిస్తుంది. అణ్వాయుధాలను ప్రమాదవశాత్తు లేదా అనధికారికంగా ఉపయోగించే ప్రమాదాన్ని తగ్గించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని మరియు అణ్వాయుధాలపై విశ్వాసాన్ని పెంపొందించే చర్యలకు ఇరు దేశాలు కట్టుబడి ఉండాలని ఒప్పందంలో పేర్కొన్నారు.
కార్గిల్‌లో చొరబాటుతో వెన్నుపోటు:
లాహోర్ ఒప్పందం కుదిరిన మూడు నెలలోపే మే 1999లో పాకిస్తాన్ వెన్నుపోటు పొడించింది.పాకిస్తాన్ ఆర్మీ, ఉగ్రవాదులతో కలిసి ‘‘ఆపరేషన్ బదర్’’ పేరుతో భారత సైన్యానికి చెందిన ఎత్తైన పోస్టుల్ని స్వాధీనం చేసుకుంది. పాకిస్తాన్ చొరబాటుదారులు సియాచిన్ గ్లేసియర్ వద్ద భారత సైన్యాన్ని వేరు చేయడంతో పాటు కాశ్మీర్, లడఖ్ మధ్య సంబంధాన్ని తెంచాలనే లక్ష్యంతో కార్గిల్ ద్రాస్ సెక్టార్, లడఖ్‌లోని బటాలిన్ సెక్టార్లలో NH 1A రహదారికి ఎదురుగా ఎత్తైన ప్రదేశాలను ఆక్రమించింది. ఈ ఆపరేషన్‌కి అప్పటి మాజీ ఆర్మీ చీఫ్, దివంగత నియంత పర్వేజ్ ముషారఫ్ హస్తం ఉంది.
పాక్ కుట్రకు వ్యతిరేకంగా భారత్ దాడుల్ని ముమ్మరం చేసింది. దీంతో కార్గిల్ యుద్ధం ప్రారంభమైంది. రెండు లక్షల మంది భారతీయ సైనికులు పాకిస్తాన్ దళాలను వెనక్కి వెళ్లేలా యుద్ధం ప్రారంభించారు. ఈ మిషన్‌కి ‘‘ఆపరేషన్ విజయ్’’ అనే పేరు పెట్టారు. 18,000 అడుగుల కంటే ఎత్తైన పోస్టులను స్వాధీనం చేసుకునేందుకు భారత్ ఆర్మీ అత్యంత సవాళ్లను ఎదుర్కొని విజయం సాధించాయి. భారత వైమానిక దళం వివాదాస్పద బోఫోర్స్ FH-77B హోవిట్జర్‌లను మొదటిసారిగా ఎగువన ఉన్న శత్రువులను నాశనం చేయడానికి ఉపయోగించింది. యుద్ధంలో 2.50 లక్షల షెల్లు, రాకెట్లు మరియు బాంబులు ఉపయోగించబడ్డాయి, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మొదటిసారిగా ఇంత భారీ మొత్తంలో మందుగుండు సామాగ్రిని కార్గిల్ యుద్ధంలో ఉపయోగించారు.
పాకిస్తాన్‌కి అమెరికా వార్నింగ్:
పాకిస్తాన్ ఈ యుద్ధంలో ఓటమి అంచులో ఉండటంతో అప్పటి పాక్ ప్రధాని, అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ సాయాన్ని కోరారు. నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) నుంచి బలగాలను ఉపసంహరించుకోవాలని బిల్ క్లింటన్, పాకిస్తాన్‌కి వార్నింగ్ ఇచ్చారు.
రెండు నెలల భీకర యుద్ధం తర్వాత పాకిస్తాన్ సైన్యాన్ని ఉపసంహరించుకుంది. పాక్ సైన్యం ఈ ఆపరేషన్‌కి సంబంధించిన వివరాలను ప్రభుత్వం నుంచి దాచిపెట్టిందని తెలిసింది. ఈ విజయానికి ప్రతీకగా జూలై 26ని ‘‘కార్గిల్ విజయ్ దివస్’’గా జరుపుకుంటున్నారు. ఈ పరిణామాల అనంతరం పాక్ ప్రధానిగా నవాజ్ షరీఫ్ పదవీచ్యుతుడయ్యడు. ముషారఫ్ సైనిక నియంతగా, పాక్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు. ఈ యుద్ధం అంతర్జాతీయంగా పాకిస్తాన్ విశ్వసనీయతను దెబ్బతీసింది.