ఇంకొన్ని గంటల్లో 2025 సంవత్సరం ముగియనుంది. 2026 సంవత్సరానికి వెల్కమ్ పలకనున్నారు. అయితే ఈ ఏడాది అనేక క్రైమ్ సీన్లలో నారీమణులు ప్రముఖ పాత్ర పోషించారు. అడ్డదారులు తొక్కి కటకటాల పాలయ్యారు. కొందరు మహిళలు చరిత్ర సృష్టిస్తే.. ఇంకొందరు మహిళలు నేరాలకు పాల్పడి జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు. వారు ఎవరు? ఏంటో తెలియాలంటే ఈ వార్త చదవండి.
రన్యారావు..
రన్యారావు కన్నడ నటి. తండ్రి ఐపీఎస్ అధికారి రామచంద్రరావు. మార్చి 3న కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడింది. దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తరలిస్తూ దొరికిపోయింది. తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని వీఐపీ సౌకర్యాన్ని ఉపయోగించుకుని తప్పించుకుంది. అయితే పాపం పండి దొరికిపోయింది. ప్రస్తుతం జైల్లో మగ్గుతోంది. దాదాపు రూ.17 కోట్ల విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె ఇంట్లో సోదాలు చేయగా.. కోట్ల విలువైన ఆభరణాలతో పాటు భారీగా నగదు లభ్యమైంది.

మీరుట్ హత్య
మీరుట్ హత్య యావత్తు దేశాన్ని కుదిపేసింది. నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్‌ను భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాలు అత్యంత దారుణంగా హతమార్చి శరీరాన్ని ముక్కులుగా చేసి డ్రమ్ములో వేసి సిమెంట్‌తో కప్పేశారు. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. డ్రగ్స్ బానిసలుగా మారిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.

సోనమ్ రఘువంశీ
సోనమ్ రఘువంశీ(యూపీ).. ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీని మే 9న వివాహం చేసుకుంది. అనంతరం హనీమూన్ మర్డర్ పేరుతో మేఘాలయ తీసుకెళ్లి కిరాయి హంతకులతో అంతమొందించింది. అనంతరం భర్త మృతదేహాన్ని లోయలో పడేసి ప్రియుడు రాజ్ కుశ్వాహా పారిపోయింది. జూన్‌లో సోనమ్ పోలీసుల ఎదుట లొంగిపోయింది. ఈ హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అంతేకాదు ఈ ఘటనపై సినిమా కూడా రాబోతుంది.

జ్యోతి మల్హోత్రా
జ్యోతి మల్హోత్రా పేరు పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పేరు మార్మోగింది. ఏప్రిల్ 22న పహల్గామ్లో ఉగ్ర దాడి జరిగింది. 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం భారతదేశం పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఇక రంగంలోకి దిగిన అధికారులు దర్యాప్తు చేపట్టగా జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్‌కు ఐఎస్ఐ ఏజెంట్‌గా పని చేసినట్లుగా గుర్తించి అరెస్ట్ చేశారు. పాకిస్థాన్ అధికారులతో అంటకాగినట్లుగా వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్కపెడుతోంది.

డాక్టర్ షాహీన్ సయీద్
షాహీన్ సయీద్.. దేశ వ్యాప్తంగా భారీ ఉగ్ర దాడులకు ప్లాన్ చేసింది. సహచర డాక్టర్లు ఉమర్, ముజమ్మిల్‌తో కలిసి బాంబ్ పేలుళ్లకు కుట్ర పన్నింది. డిసెంబర్ 10న ఢిల్లీ ఎర్రకోట దగ్గర జరిగిన కారు బ్లాస్ట్‌లో డాక్టర్ ఉమర్ హతమయ్యాడు. వీళ్లంతా అల్-ఫలాహ యూనివర్సిటీ వేదికగా ఉగ్రదాడులకు ప్లాన్ చేసినట్లుగా దర్యాప్తు బృందం గుర్తించింది. ప్రస్తుతం నిందితులు జైల్లో ఉన్నారు.
