Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లోని అఖ్నూర్ సెక్టార్‌లో ఐఈడీ పేలుడు జరిగింది. ఈ రోజు ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో ఇద్దరు భారత సైనికులు మరణించినట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది. సైన్యానికి చెందిన వైట్ నైట్ కార్ప్స్ జవాన్ల మరణాలను నిర్ధారించింది. సైనికులు నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి గస్తీలో ఉండగా ఐఈడీ దాడి జరిగింది. దాడి జరిగిన తర్వాత భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించిందని సైన్యం తెలిపింది.
మరొక జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఎల్ఓసీ సమీపంలో ఆర్మీ సిబ్బంది పెట్రోలింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో పేలుడు సంభవించింది. కెప్టెన్‌తో సహా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన సైనికుడిని చికిత్స నిమిత్తం ఆర్మీ ఆస్పత్రికి హెలికాప్టర్‌లో తరలించారు. ప్రస్తుతం అతడు ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు అధికారులు తెలిపారు.