Jammu Kashmir: జమ్మూకాశ్మీర్ ప్రాంతంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రసంస్థలు, పాకిస్తాన్ కుట్రలు చేస్తూనే ఉన్నాయి. పీఓకే నుంచి జమ్మూకాశ్మీర్ లోకి ఉగ్రవాదుల చొరబాట్లను ప్రోత్సహిస్తున్నాయి. ఎల్ఓసీ వెంబడి పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాద లాంచ్ ప్యాడ్స్ నుంచి ఉగ్రవాదుల్ని ఇండియాలోకి పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే టెర్రిస్టుల ప్రయత్నాలను ఎప్పటికప్పుడు భారత సైన్యం తిప్పికొడుతోంది.
Read Also: UK: గురుద్వారాలోకి రాకుండా భారత దౌత్యవేత్తను అడ్డుకున్న ఖలిస్తాన్ వేర్పాటువాదులు.
తాజాగా పీఓకే నుంచి జమ్మూ కాశ్మీర్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు ఉగ్రవాదుల్ని ఇండియన్ ఆర్మీ హతమార్చింది. ఉత్తర కాశ్మీర్ లోని కుప్వారా జిల్లాలోని మచిల్ సెక్టార్ ప్రాంతంలో ఎల్ఓసీ వెంబడి ఈ ఆపరేషన్ జరిగింది. మరోవైపు ఈ రోజు తెల్లవారుజామున పుల్వామా జిల్లాలోన గుల్షన్‌పోరా త్రాల్ లోని గుజార్ బస్తీ ప్రాంతంలో రెండు ఉగ్రవాద స్థావరాలను భద్రతా బలగాలు ఛేదించాయి.
జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఆర్మీ నాగ్‌బాల్ ఫారెస్ట్, గుల్షన్ పోరాత్రాల్ లోని అటవీ ప్రాంతంలో నిర్ధిష్టం సమాచారంతో సోదాలు చేయగా ఉగ్రవాదుల స్థావరాలు బయటపడ్డాయని పోలీసులు తెలిపారు. ఇప్పుడిప్పుడే కాశ్మీర్ ప్రాంతంలో సాధారణ పరిస్థితులు నెలకొనడంతో పాటు అభివృద్ధి జరుగుతోంది. దీన్ని అడ్డుకునేందకు పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్రవాదులు, ఆ దేశ గూఢాచర సంస్థ ఐఎస్ఐ కుట్రలు పన్నుతోంది.