దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కుర్లా ప్రాంతంలో ఉన్న ఓ నాలుగు అంతస్తుల భవనం సోమవారం రాత్రి కుప్పకూలింది. ఈ విషాద ఘటనలో 18 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు 23 మందిని కాపాడినట్లు అధికారులు వెల్లడించారు.
సమాచారమందుకున్న మహారాష్ట్ర మంత్రి, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే ఘటనాస్థలిని పరిశీలించారు. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. శిథిలావస్థలో ఉన్న భవనాల యజమానులకు గతంలోనే నోటీసులు అందించామని, వాటిని సీరియస్‌గా తీసుకోవాలని అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో మృతుల కుటుంబాలకు మహారాష్ట్ర సర్కారు రూ.5లక్షల పరిహారం ప్రకటించింది. ఈ విషాద ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి సుభాష్ దేశాయ్ తెలిపారు.