1-Year-Old Attacked By Leopard In Mumbai’s Aarey, Dies: వాణిజ్య నగరం ముంబై శివార్లలో చిరుతపులి దాడి చేసింది. ఏడాది
చిన్నారిపై దాడి చేసి చంపేసింది. శివారు ప్రాంతమైన గోరేగావ్ లోని ఆరే కాలనీలో అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఆరే కాలనీ యూనిట్ నెంబర్ 15లో ఈ ఘటన చోటుచేసుకుంది. తల్లితో కలిసి సమీపంలో ఉన్న గుడికి వెళ్తున్న క్రమంలో చిరుత దాడి చేసిందని పోలీసులు తెలిపారు. దాడి జరిగిన తర్వాత చిన్నారిని ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. తీవ్ర గాయాలపాలైన చిన్నారి మరణించింది. ఈ ఘటనపై పోలీసులు యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్ నమోదు చేశారు.
Read Also: UK PM Rishi Sunak: బ్రిటన్ కొత్త ప్రధానిగా రిషి సునాక్..
ముంబైలోని ఆరే ప్రాంతంలో గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఇక్కడ ప్రజలు – వన్యప్రాణులకు మధ్య సంఘర్షణ ఏర్పడుతోందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అటవీ శాఖ కార్యాచరణ ప్రారంభించిందని ఆ శాఖకు చెందిన అధికారులు చెబుతున్నారు. వన్యప్రాణి అంబులెన్సులతో పాటు వాలంటీర్లను ఈ ప్రాంతంలో మోహరించారు. చిరుతపులి నిపుణులు, పశువైద్యులు, అటవీ శాఖ అధికారులు ఈ వారం మొత్తం ఆరే కాలనీలోనే ఉండనున్నారు. చిరుత కదలికలను గుర్తించడానికి, పర్యవేక్షించడానికి రాత్రిపూట పెట్రోలింగ్ చేయడంతో పాటు కెమెరా ట్రాపులను అమర్చనున్నారు.