జీనత్ అమన్.. ఈ పేరు 1970లలో ఎంతోమంది సరసులకు ఓ మంత్రం! జీనత్ పేరే జపిస్తూ ఆమె అందాలను ఆరాధిస్తూ, తెరపై ఆ శృంగార రసాధిదేవతను చూసి, ఆమెను తమ స్వప్న సామ్రాజ్యాలకు మహారాణిగా పట్టాభిషేకం చేసుకున్నారు. అలాంటి వారు ఈ నాటికీ ఆ నాటి జీనత్ అందాలను తలచుకుంటూ మురిసిపోతున్నారు. జీనత్ కు 70 ఏళ్ళు నిండాయంటే వినడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఆమె చాలా రోజుల క్రితమే ముసలి పాత్రల్లోకి ఎంటరై పోయింది. అయినా, అభిమానులు కదా… తమ స్వప్నసుందరిని ముసలి అంటే ముడుచుకుపోతారు.
జీనత్ అమన్ 1951 నవంబర్ 19న జన్మించారు. జీనత్ తండ్రి అమానుల్లా ఖాన్. ఆయన ‘అమన్’ అనే కలం పేరుతో రచనలు చేసేవారు. ‘ముఘల్-ఏ-ఆజమ్, పాకీజా’ వంటి చిత్రాల రచనలో ఆయన పాలు పంచుకున్నారు. ముఖ్యంగా ‘ఉర్దూ’ మిళితమైన సంభాషణలు ఉన్న చిత్రాలకు అమన్ రచన చేసేవారు. తరువాత అదే పేరును జీనత్ జోడించుకొని జీనత్ అమన్ అయ్యారు. ప్రముఖ నటుడు రాజా మురాద్, వీరికి సమీప బంధువు. చదువులో చురుకైన జీనత్ అమన్ కు లాస్ ఏంజెలిస్ లోని ‘యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా’లో సీటు లభించింది. అయితే, డిగ్రీ పూర్తి చేయకముందే, ఆమె అందాల పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచారు. ‘ఫెమినా మిస్ ఇండియా’, ‘మిస్ ఏసియా పసిఫిక్ ఇంటర్నేషనల్’గానూ జీనత్ నిలిచారు. ఆ అందాల పోటీలో విన్నర్ గా నిలిచే సమయానికి ఆమె వయసు 19 ఏళ్ళు. ఆమె నును లేత అందాలను చూసి మోజుపడ్డ దేవానంద్ ఆమెకు తాను నటించిన ఇండో ఫిలిపియన్ మూవీ ‘ది ఈవిల్ వితిన్’లో ఓ కీలక పాత్ర పోషించే అవకాశం కల్పించారు. ఈ సినిమా ‘పాస్ పోర్ట్ టు డేంజర్’ పేరుతోనూ ప్రసిద్ధమయింది. ఈ చిత్రం తరువాత ‘హల్ చల్’, ‘హంగామా’ హిందీ చిత్రాల్లో నటించారు జీనత్. ‘హల్ చల్’ ఆమె తొలి హిందీ సినిమా. దేవానంద్ దర్శకత్వం వహించి, నటించిన ‘హరే రామ హరే కృష్ణ’ చిత్రంలో హీరోకు చెల్లెలి పాత్రలో కనిపించారు జీనత్ అమన్. ఆ సినిమాలో ఆమె నటించిన “ధమ్ మారో ధమ్…” పాట అప్పట్లో జనాన్ని భలేగా కిర్రెక్కించింది. ఆ మూవీ గ్రాండ్ సక్సెస్ తో జీనత్ స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించేసింది.
జీనత్ నటించిన “యాదోంకీ బారాత్, రోటీ కపడా ఔర్ మకాన్, అజనబీ, చోరీ మేరా కామ్, ధరమ్-వీర్, ఛలియా బాబు, హమ్ కిసిసే కమ్ నహీ” వంటి చిత్రాలు జైత్రయాత్ర చేశాయి. రాజ్ కపూర్ తెరకెక్కించిన ‘సత్యం శివం సుందరం’లో జీనత్ అందాలు ఆరబోయడమే కాదు, నటిగానూ మంచి గుర్తింపు సంపాదించారు. “డాన్, అలీబాబా చాలిస్ చోర్, ఖుర్బానీ, దోస్తానా, ఇన్ సాఫ్ కా తరాజు, లావారిస్, మహాన్, పుకార్” వంటి చిత్రాలలో నాయికగా మెప్పించారు.
జీనత్ అమన్, నటుడు సంజయ్ ఖాన్ ను 1978లో పెళ్ళాడారు. యేడాదికే వారు విడిపోయారు. 1985లో నటుడు మజర్ ఖాన్ ను వివాహం చేసుకున్నారు జీనత్. అతను కూడా మొదటి భార్యతో విడాకులు తీసుకున్నవారే. అమితాబ్ బచ్చన్ నటించిన ‘షాన్’లో “నామ్ అబ్దుల్లా హై మేరా…” పాటలో నటించిన మజర్ ఖాన్ ఆ తరువాత పలు చిత్రాలలో కీలక పాత్రలు పోషించారు. మజర్ ను పెళ్ళాడిన తరువాత జీనత్ సినిమాలు తగ్గించారనే చెప్పాలి. జీనత్, మజర్ కు ఇద్దరు పిల్లలు. మజర్ 1998లో కన్నుమూశారు. ఆ తరువాత జీనత్ మనశ్శాంతి కోసం సినిమాల్లో నటించాలని భావించి, 1999లో ‘భోపాల్ ఎక్స్ ప్రెస్’లో కనిపించారు జీనత్. “బూమ్, అగ్లీ ఔర్ పగ్లీ, చౌరాహెన్, దిల్ తో దీవానా హై, సల్లూ కీ షాదీ, పానిపట్” వంటి చిత్రాలలో జీనత్ అభినయించారు. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రల్లో నటించడానికి రెడీ అంటున్నారు జీనత్ అమన్. ఆమె మరిన్ని పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని ఆశిద్దాం