Top Gare: పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ కు ధీటుగా రంగంలోకి దిగాడు మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్. భన్వర్ సింగ్ షెకావత్ గా పరకాయ ప్రవేశం చేసి పార్టీ లేదా పుష్ప అంటూ తనదైన స్టైల్లో అదరగొట్టేశాడు. ఈ సినిమా తరువాత తెలుగులో ఫహద్ రేంజ్ పెరిగిందనే చెప్పాలి. పుష్ప తరువాత ఫహద్ మలయాళ సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి. ఇక మొట్ట మొదటిసారి ఫహద్ తెలుగులో స్టైట్ ఫిల్మ్ చేయడానికి రెడీ అయిన విషయం విదితమే. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ లో ఫహద్ నటిస్తున్న చిత్రం టాప్ గేర్. సుధీశ్ శంకర్ దర్శహకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటుంది. ఇక నిన్ననే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
ఇక నేడు ఈ సినిమా టైటిల్ వివాదంలో ఇరుక్కుంది. టాప్ గేర్ పేరును తాము ముందే రిజిస్టర్ చేసుకున్నామని నిర్మాత శ్రీధర్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆది సాయి కుమార్ హీరోగా ఈ టైటిల్ తో సినిమా తెరక్కిస్తున్నామని, సినిమా మధ్యలో ఉందని, ఇప్పుడు మా టైటిల్ ను మలయాళ హీరో వాడుతున్నట్లు చెప్పుకొచ్చాడు. ఈ సినిమా టైటిల్ చూసిన వారు తమ సినిమానే అని కన్ప్యూజ్ అయ్యి తమకు కాల్ చేసి చెప్తున్నారని, రేపు రెండు సినిమాలు ఒకే పేరుతో రిలీజ్ అయితే ప్రేక్షకులు కన్ప్యూజ్ అవుతారని, మొదట ఆ టైటిల్ ను తాము రిజిస్టర్ చేసుకున్నాం కాబట్టి వారు వేరో పేరును పెట్టుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఈ టైటిల్ వివాదంపై మేకర్స్, ఫహద్ ఎలా స్పందిస్తారో చూడాలి.