Writer Padmabhushan: సుహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’. ఈ వినోదాత్మక చిత్రం ద్వారా దర్శక నిర్మాతలు ఓ చక్కని సందేశాన్ని కూడా ఇచ్చారు. మధ్య తరగతి మగువల మనసెరిగి ప్రవర్తించాలని, వారి మనోభావాలను గుర్తించి, గౌరవించాలని చెప్పారు. దర్శకుడు షణ్ముక్ ప్రశాంత్ తన తొలి చిత్రంతోనే గుడ్ మేకర్ గా పేరు తెచ్చుకున్నాడు. ‘మేజర్’ మూవీ తర్వాత రెండో హిట్ ను ఈ సినిమాతో పొందారు నిర్మాతలు శరత్ చంద్ర, అనురాగ్ రెడ్డి. ఇటీవల ఈ సినిమాను చూసి మహేశ్ బాబు సైతం ప్రశంసించారు. అయితే… ఎవరి కోసమైతే ఈ సినిమా తీశారో వారికి ఇది చేరాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్ర నిర్మాతలు ఓ నిర్ణయం తీసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఎంపిక చేసిన 30కి పైగా థియేటర్లలో రేపు (బుధవారం) నాలుగు ఆటలను ఉచితంగా మహిళలకు ప్రదర్శించ బోతున్నారు. దీనికి సంబంధించిన మోడల్ పాస్ ను ప్రముఖ యాంకర్ సుమ మంగళవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన శరత్ చంద్ర మాట్లాడుతూ, ”మొత్తం 39 థియేటర్స్ లో నాలుగు షోలు కలిపి దాదాపు 70 వేల మంది ప్రేక్షకులు సినిమా చూసే కెపాసిటీ వుంది. 70 వేల ఫ్యామిలీస్ తో రేపు ఒక మీటింగ్ జరగబోతుంది. దీని కోసం కోటి రూపాయలు పెడుతున్నాం. ఎక్కువ మంది మహిళా ప్రేక్షకులు చూడాలనేది మా ఉద్దేశం. గీతా ఆర్ట్స్ వారికి ఈ ఆలోచన చెప్పగానే ఎంతోగానో సపోర్ట్ చేశారు. పాసులు ప్రింట్ చేసి ఎంపిక చేసిన థియేటర్స్ పంపించాం. మహిళలకు కౌంటర్ వద్ద ఉచిత పాసులు ఇస్తారు. భార్య భర్తలు ఇద్దరూ కలిసి వస్తే .. భార్య ఉచితంగా సినిమా చూస్తారు, భర్త టికెట్ కొనుక్కుంటారు. దయచేసి రేపు మహిళలు అందరూ వచ్చి సినిమా చూసి ఓ గొప్ప స్ఫూర్తిని పొందుతారని ఆశిస్తున్నాను” అని అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొని సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది.