‘బిగ్ బాస్’ తెలుగునాట అందరినీ ఆకట్టుకున్న రియాలిటీ షో. అయితే ఇప్పటి వరకూ ఈ షో లో విజేతలుగా నిలిచిన వారికి ఎవరికీ స్టార్ డమ్ దక్కలేదు. అంతే కాదు ప్రజలలో గుర్తింపు వచ్చినా చిత్ర పరిశ్రమలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న తీరులో సాగుతూ వచ్చింది. దీనికి ఈ షోలో పాల్గొని విజేతలుగా, రన్నరప్‌లుగా నిలిచిన వారే నిదర్శనం. ఇక ఈ షోలో పార్టిసిపేట్ చేసిన హాటీలు ఎన్ని విధాలుగా ఎంత ప్రయత్నించినా సినిమా పరిశ్రమలో అవకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే వచ్చాయి. చక్కటి లుక్స్ తో పాటు నటన, ఆకర్షణీమైన రూపలావాణ్యాలు ఉన్న వారు సైతం ఎందుకో రాణించలేక పోయారనే చెప్పాలి.
తాజాగా బిగ్ బాస్ ఓటీటీలో తొలిసారి విజేతగా నిలిచింది ఓ లేడీ. తనే బిందుమాధవి. ఎప్పటి నుంచో టాలీవుడ్‌లో పడుతూ లేస్తూ వస్తున్న ఈ తెలుగమ్మాయి ‘ఆవకాయ్ బిర్యానీ, బంపర్ ఆఫర్’ వంటి సినిమాల్లో నటించినా కమర్షియల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకోలేక పోయింది. ఆ తర్వాత కోలీవుడ్‌కు వెళ్లి కొన్ని తమిళ సినిమాలు చేసినా అక్కడా స్టార్ స్టేటస్ చూడలేదు. తమిళ బిగ్ బాస్‌లో సైతం మెరిసింది. ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ ఓటీటీ విజేతగా నిలిచింది. మరి ఈ కిరీటం అమ్మడికి అవకాశాలు తెచ్చిపెడుతుందా అన్నది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. ఓటీటీ సినిమాలు ఊపందుకున్న తరుణంలో బిందుమాధవి దశ తిరుగుతుందేమో చూడాలి.