ఉలగనాయకుడు కమల్ హాసన్ గత కొంత కాలంగా వరుసగా అపజయాలను ఫేస్ చేస్తున్నాడు. 2008లో ‘దశావతారం’, 2013లో ‘విశ్వరూపం’ తప్ప ఇటీవల కాలం వచ్చిన కమల్ సినిమాలు అన్నీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజాయాలను అందుకున్నాయి. 2017 నుంచి తమిళ బిగ్ బాస్ కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ వస్తున్నాడు కమల్. ఇటీవల కాలంలో రాజకీయాల బాట పట్టిన కమల్ మక్కల్ నీతిమయం పేరుతో పార్టీ స్థాపించి 2019 లోక్ సభ ఎన్నికల్లో పోటీచేశాడు. అయితే పోటీ చేసిన 37 సీట్లలో ఓడిపోయి ఎలాంటి ప్రభావం చూపించలేకపోయాడు. ఇక 2021లో తమిళనాడు అసెంబ్లీకి 154 సీట్లకు పోటీ చేసిన కమల్ పార్టీ ఒక్క సీటు గెలవకపోగా 2.62 పర్సంటేజ్ ఓట్లను మాత్రమే పొందగలిగింది.
తాజాగా కమల్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తన సొంత సంస్థ రాజ్ కమల్ ఫిలి్స్ ఇంటర్నేషనల్ పతాకంపై ‘విక్రమ్’ సినిమా రూపొందించాడు. విజయ్ సేతుపతి, పహాద్ ఫాజిల్ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా జూన్ 3న విడుదల కానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రచారం ఉదృతంగా జరుపుతున్నారు. తెలుగులో ఈ సినిమాను నితిన్ నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మూవీస్ పతాకంపై విడుదల చేస్తున్నారు. ఒకప్పుడు కమల్ హాసన్ సినిమా వస్తోంది అంటే తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేవారు.
ఇప్పుడు పరిస్థితి మారింది. కమల్ కూడా గుంపులో గోవింద అయిపోయాడు. దానికి కారణం గత కొన్నేళ్ళుగా ఎదురవుతున్న పరాజయాలే. ఈసారి మాత్రం అందరినీ పూర్తి స్థాయిలో సంతృప్తి పరిచేలా ‘విక్రమ్’తో రాబోతున్నట్లు కమల్ చెబుతున్నాడు. అయితే ‘విక్రమ్’కి పోటీగా మహేశ్ బాబు నిర్మించిన అడవిశేస్ పాన్ ఇండియా సినిమా ‘మేజర్’ విడుదల కాబోతోంది. అందుకే తెలుగులో ‘విక్రమ్’ ప్రచారాన్ని భారీ స్థాయిలో చేయటానికి కమల్ ని కలిశాడు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి. హైదరాబాద్ లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీస్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఇందులో నితిన్ కి సన్నిహితులైన టాలీవుడ్ ప్రముఖులు కూడా పాల్గొనబోతున్నారట. ‘విక్రమ్’లో మరో స్టార్ హీరో సూర్య అథిగా మెరవనుండటం, అనిరుద్ సంగీతాన్ని అందిస్తుండటం ఎంత వరకూ ప్లస్ అవుతాయి? కమల్ చెప్పినట్లు ఆకట్టుకునే కథాంశం ఉంటుందా!? ఈ సారైనా కమల్ తెలుగువారి మెప్పు పొందుతాడా? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం లభించాలంటే జూన్ 3 వరకూ ఆగాల్సిందే. లెట్స్ వెయిట్ అండ్ సీ…