Will Andhra Pradesh Government hikes Bhola Shankar Ticket Rates: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన భోళాశంకర్ సినిమా టికెట్ రేట్లు పెంచుతారా లేదా…? సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. ఏపీ ప్రభుత్వ నిర్ణయం ఆసక్తి రేపుతోంది. భోళాశంకర్ టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతించాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది సినిమా యూనిట్. అయితే ఈలోపే వాల్తేరు వీరయ్య ఫంక్షన్‌లో చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ఎందుకన్న చిరంజీవి వ్యాఖ్యలపై ఇప్పటికే మంత్రులు ఫైరయ్యారు. ఈ క్రమంలో ప్రభుత్వం షాక్ ఇస్తుందా అనే అంశం మీద చర్చ జరుగుతుండగా అసలు టీమ్ దాఖలు చేసిన దరఖాస్తు అసంపూర్తిగా ఉందంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. పలు డాక్యుమెంట్లు జత చేయలేదంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. డాక్యుమెంట్లు సమర్పించాలని భోళాశంకర్ టీమ్‌కు చెప్పామంటున్నారు అధికారులు. దీంతో ప్రభుత్వం దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తి రేపుతోంది. ఎల్లుండి భోళాశంకర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక చిరంజీవిపై ఏపీ ప్రభుత్వ నేతలు ఫైర్ అవుతున్న క్రమంలో ఎన్టీఆర్ జిల్లా నందిగామలో చిరంజీవి అభిమానులు, జనసేన కార్యకర్తలు నిరసనకు దిగారు.
చిరంజీవిపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నిన్న చిరంజీవి వ్యాఖ్యలపై మాజీ మంత్రులు కొడాలి నాని పేర్ని నాని, మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలను ఖండించారు జనసేన నేతలు….వారి దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు చిరు అభిమానులు, . అనంతపురంలో సైతం నిరసనకు దిగారు ఫ్యాన్స్. వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ టవర్ దగ్గర నిరసన చేపట్టారు. రాష్ట్ర భవిష్యత్తు గురించి మాట్లాడితే విమర్శలు చేస్తున్నారంటూ చిరు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి గురించి మరోసారి మాట్లడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. గుడివాడలో అయితే చిరంజీవి అభిమానుల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. గుడివాడ వీధుల్లో అభిమానుల నిరసన ర్యాలీ తీశారు. కొడాలి నాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కొడాలి నాని డౌన్ డౌన్… జై చిరంజీవ అంటూ నినాదాలు మిన్నంటాయి. చిరంజీవి అభిమానుల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, చిరు అభిమానులకు మధ్య తోపులాట జరిగగా పోలీసు వాహనాలకు అడ్డంగా పడుకున్నారు చిరంజీవి ఫ్యాన్స్. ఒక దశలో వారిని పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు.