బిగ్ బాస్ సీజన్ 6లో అందరిపైనా నోరేసుకుని పడిపోతున్న వ్యక్తి ఎవరూ అంటే ఏకాభిప్రాయంతో చెప్పే పేరు ‘గీతూ రాయల్’. చిత్తూరు యాసలో మాట్లాడుతూ వ్యూవర్స్ ను ఆకట్టుకుంటున్న గీతూ, తన ప్రవర్తనతో మాత్రం జనాలను మెప్పించలేకపోతోంది. అంతేకాదు.. తన తోటి కంటెస్టెంట్స్ మనసు కూడా గెలుచుకోలేకపోతోంది. దాంతో రెండోవారం నామినేషన్స్ సమయంలో ‘ఈ ఇంటి నుండి బయటకు వెళ్ళే అర్హత ఉన్న వ్యక్తి ఎవరు?’ అని బిగ్ బాస్ ప్రశ్నించినప్పుడు అత్యధికంగా ఆరు మంది గీతూ పేరును ప్రపోజ్ చేశారు. శ్రీహన్ తో మొదలు పెట్టి నేహా చౌదరి, చలాకీ చంటి, సుదీప, ఆర్జే సూర్య, రేవంత్… గీతూకు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఈసారి ఒక వ్యక్తి ఒకరినే నామినేట్ చేయాలనే కండీషన్ బిగ్ బాస్ పెట్టడంతో క్లియర్ కట్ గా నామినేషన్స్ జరిగాయి.
గీతూ తర్వాత స్థానంలో తన యాటిట్యూడ్ తో కొంతమంది కంటెస్టెంట్స్ కు కంటగింపుగా మారిన సింగర్ రేవంత్ నిలిచాడు. అతనికి వ్యతిరేకంగా ఐదుగురు ఓట్ చేశారు. ఆది, షానీకి మూడు నెగెటివ్ ఓట్లు రాగా, మరీనా – రోహిత్, అభినయశ్రీ, రాజశేఖర్, ఫైమాకు వ్యతిరేకంగా ఒక్కొక్క ఓటు పడింది. కెప్టెన్ అయిన కారణంగా ఈ వారం నామినేషన్స్ నుండి బాలాదిత్యకు వెసులుబాటు కలిగింది. దానికి తోడు అతనికి మాత్రం ఇద్దరిని నామినేట్ చేసే ఛాన్స్ బిగ్ బాస్ కల్పించాడు. దాంతో తెలివిగా… ‘ఈ హౌస్ నుండి వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్ళరనే నమ్మకంతోనే తాను షానీ, రాజశేఖర్ లను నామినేట్ చేస్తున్న’ట్టు బాలాదిత్య పేర్కొన్నాడు. సో… మొదటివారం ఎలిమినేషన్స్ లో ఏడుగురు ఉండగా, బిగ్ బాస్ అందరినీ సేవ్ చేశాడు. ఈసారి మాత్రం ఏకంగా ఎనిమిది మందిని నామినేట్ అయ్యారు. రాజశేఖర్, షానీ, అభినయశ్రీ, రోహిత్-మరీనా, ఫైమా, ఆదిరెడ్డి, గీతూ, రేవంత్ లలో ఎవరు ఎక్కువ ఓట్లు పొందుతారు, ఎవరు తక్కువ ఓట్లు పొందుతారు అనేది చూడాలి. అయితే గీతూను సమర్థించే సోషల్ మీడియా సైన్యం బయట బాగానే ఉన్న కారణంగా ఆమెపై వేటు పడదనే నమ్మకం చాలామందికి ఉంది. పైగా ఆమెలాంటి టాకిటివ్ పర్సన్ ను బిగ్ బాస్ అంత తేలికగా వదులుకోడనీ అంటున్నారు. సో… ఈ వారం అభినయశ్రీ, రాజశేఖర్ లలో ఒకరు ఎలిమినేట్ కావచ్చుననిపిస్తోంది!