‘ఆహా’లో మొన్నటి వరకూ ప్రసారమైన బాలకృష్ణ టాక్ షో ‘అన్ స్టాపబుల్’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ టాక్ షో కు చిరంజీవి కూడా హాజరవుతారని, న్యూ ఇయర్ సందర్భంగా లేదా సంక్రాంతి పర్వదినాల్లో ఆ స్పెషల్ ఎపిసోడ్ ప్రసారం అవుతుందని బయట బోలెడు చర్చ జరిగింది. కొందరైతే బాలకృష్ణ షో తొలి ఎసిపోడ్ గెస్ట్ అసలు చిరంజీవే అంటూ కూడా ప్రచారం చేశారు. కానీ ‘అన్ స్టాపబుల్’ తొలి సీజన్ లో ప్రసారమైన పదకొండు ఎపిసోడ్స్ లోనూ చిరంజీవి లేరు. దీనిపై షో లో ప్రధాన బాధ్యతలను నిర్వర్తించిన బీవీయస్ రవి ఎన్టీవీ ఎంటర్ టైన్ మెంట్ కు వివరణ ఇచ్చారు. అప్పటికే సమంత నిర్వహించిన ‘సామ్ జామ్’ టాక్ షో కు చిరంజీవి పాల్గొన్నా, మరోసారి ఆయన్ని బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్’ షో లోనూ పార్టిసిపేట్ చేయించాలని తామంతా గట్టిగా అనుకున్నామని అన్నారు.
అయితే… రెండు ఎపిసోడ్స్ పూర్తి అయిన తర్వాత బాలకృష్ణ భుజానికి ఆపరేషన్ జరగడంతో కొన్ని వారాలు షో కు, షూటింగ్ కు బ్రేక్ పడిందని, ఆ సమయంలో నిజానికి చిరంజీవి డేట్స్ ఇచ్చారని, కానీ వాటిని తాము ఉపయోగించుకోలేక పోయామని అన్నారు. ఆ తర్వాత చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’, ‘భోళాశంకర్’, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే చిత్రాల షూటింగ్స్ మొదలు కావడంతో చిరంజీవి టైమ్ ఇవ్వలేకపోయారని, అదే సమస్య రవితేజాతోనూ వచ్చిందని, ఆయన కూడా మూడు నాలుగు సినిమా షూటింగ్స్ లో ఒకేసారి పాల్గొనడంతో ఆ ఎపిసోడ్ షూటింగ్ చేయడానికి చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నామ’ని అన్నారు. అయితే ‘అన్ స్టాపబుల్’ సెకండ్ సీజన్ లో బాలకృష్ణ – చిరంజీవి కాంబో లో స్పెషల్ ఎపిసోడ్ చేయాలని తాను కోరుకుంటున్నానని బీవీయస్ రవి ఆశాభావం వ్యక్తం చేశారు.