Puri Jagannadh: ఒకప్పుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా వస్తోందంటే చాలు కుర్రకారు ఎప్పుడెప్పుడు ఆ చిత్రాన్ని చూసేద్దామా అన్నంత ఊపులో ఉండేవారు. యువతను ఆకట్టుకొనే అంశాలను తన కథల్లో చక్కగా చొప్పించి, వారిని పదే పదే తన సినిమా చూసేలా చేసుకోవడంలో మేటి అనిపించుకున్నారు పూరి జగన్నాథ్. తొలి సినిమా ‘బద్రి’ మొదలు, ఈ నాటి ‘లైగర్’ దాకా పూరి ప్రయత్నం అదే తీరున సాగుతోంది. శరవేగంతో సినిమాలను పూర్తి చేయగల నేర్పు పూరి సొంతం! ‘లైగర్’ పరాజయం ఆయన అభిమానులకు నిరాశ కలిగించి ఉండవచ్చు. కానీ, రాబోయే సినిమాతో మా జగన్ ఓ హిట్టు పట్టేస్తాడు చూస్తూండండి అంటూ ఫ్యాన్స్ భరోసాగా ఉన్నారు. వారిలో అంత కాన్ఫిడెన్స్ నింపిన పూరి ప్రస్తుతం ‘లైగర్’ హీరో విజయ్ దేవరకొండతోనే ‘జనగణమన’ తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు.
పూరి జగన్నాథ్ 1966 సెప్టెంబర్ 28న పిఠాపురంలో జన్మించారు. వారి స్వస్థలం విశాఖపట్నం జిల్లాలోని బాపిరాజు కొత్తపల్లి. పూరి జగన్నాథ్ పెద్ద బొడ్డపల్లిలోని సెయింట్ థెరిసా హైస్కూల్ లో చదివారు. తరువాత అనకాపల్లి ఎ.ఎమ్.ఎ.ఎల్. కాలేజ్ లో డిగ్రీ పూర్తి చేశారు. చదువులో పూరి జగన్నాథ్ చురుకైనవాడు. అలాగే సినిమాల పట్ల ఆయనకు ఎంతో ఆసక్తి ఉండేది. పాత, కొత్త అన్న తేడాలేకుండా సినిమాలు చూసేసేవారు. రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాక, మరికొందరితోనూ వర్క్ చేశారు పూరి. తరువాత సొంతగా కథ తయారు చేసుకొని డైరెక్షన్ ఛాన్స్ కోసం వేట ఆరంభించారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ వర్ధమాన కథానాయకునిగా సాగుతున్నారు. పూరి చెప్పిన కథ నచ్చడంతో పవన్ ఆయనకు దర్శకునిగా అవకాశం కల్పించారు. తత్ఫలితంగానే ‘బద్రి’ తెరకెక్కింది. మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
‘బద్రి’ తరువాత ‘బాచి’ రూపొందించారు పూరి. అది అంతగా ఆకట్టుకోలేదు. ఆయన దర్శకత్వంలో రూపొందిన మూడో సినిమా ‘ఇట్లు శ్రావణీ సుబ్రమణ్యం’ యువతను భలేగా మురిపించింది. ఈ సినిమాతో రవితేజకు హీరోగా మంచి మార్కులు లభించాయి. అదే సమయంలో కన్నడలో శివరాజ్ కుమార్ హీరోగా ‘యువరాజ’ చిత్రాన్ని తెరకెక్కించారు పూరి. ఆ సినిమా కూడా అలరించింది. ఆ తరువాత శివరాజ్ కుమార్ చిన్నతమ్ముడు పునీత్ రాజ్ కుమార్ ను హీరోగా పరిచయం చేస్తూ రూపొందిన ‘అప్పు’ తో కన్నడసీమను ఓ ఊపు ఊపేశారు పూరి. అదే చిత్రాన్ని తెలుగులో ‘ఇడియట్’ పేరుతో రవితేజ హీరోగా రూపొందించారు పూరి. ‘ఇడియట్’తో రవితేజ్ కు స్టార్ స్టేటస్ లభించింది. ఆపై రవితేజతోనే పూరి తీసిన ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’ కూడా యూత్ ను విశేషంగా ఆకట్టుకుంది. నాగార్జునతో పూరి తెరకెక్కించిన ‘శివమణి’ సైతం యువతను ఊపేసింది. తరువాత వరుసగా పూరి తీసిన ఓ ఐదు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయాయి. అప్పుడు మహేశ్ బాబు తో పూరి తెరకెక్కించిన ‘పోకిరి’ బంపర్ హిట్ గా నిలచింది. మహేశ్ కు ఎన్నెన్నో చెరిగిపోని, తరిగిపోని రికార్డులను సొంతం చేసింది ‘పోకిరి’. ఆ పై అల్లు అర్జున్ హీరోగా పూరి రూపొందించిన ‘దేశముదురు’ కూడా భలేగా మురిపించింది. ఇప్పటికీ బన్నీ కెరీర్ లో ఎక్కువ సెంటర్స్ లో శతదినోత్సవం చూసిన చిత్రంగా ‘దేశముదురు’ నిలచే ఉంది. హీరోగా రామ్ చరణ్ తొలి చిత్రం ‘చిరుత’ కూడా పూరి దర్శకత్వంలోనే తెరకెక్కింది.
ఆ పై పూరి జగన్నాథ్ వేగం పెంచి పలు చిత్రాలు పరుగులు తీస్తూ జనం ముందు నిలిపారు. అయితే ‘పోకిరి’ స్థాయి సక్సెస్ మళ్ళీ ఆయన దరి చేరలేదు. కాకపోతే, తన చిత్రాల్లోని వైవిధ్యంతో జనాన్ని మాత్రం ఎప్పటి కప్పుడు కట్టిపడేస్తూ వచ్చారు జగన్. జూనియర్ యన్టీఆర్ తో పూరి తెరకెక్కించిన ‘ఆంధ్రావాలా’ అలరించక పోయినా, ‘టెంపర్’ బంపర్ అనిపించింది. మాస్ హీరో బాలకృష్ణతో పూరి తీసిన ‘పైసా వసూల్’ నిరాశ పరచినా, అందులో బాలయ్యను తొలిసారి గాయకునిగా నిలిపారు పూరి. తన తనయుడు ఆకాశ్ హీరోగా పూరి రూపొందించిన ‘మెహబూబా’ మురిపించలేక పోయింది. రామ్ తో పూరి తీసిన ‘ఇస్మార్ట్ శంకర్’ భలేగా జనాన్ని అలరించింది. దర్శకునిగానే కాదు, కొన్ని చిత్రాలలో పూరి తెరపై కూడా కనిపించారు. “శివ, ఏ మాయ చేశావే, బిజినెస్ మేన్, టెంపర్, ఇస్మార్ట్ శంకర్, రొమాంటిక్, లైగర్” చిత్రాల్లో పూరి తళుక్కుమన్నారు. మెగాస్టార్ చిరంజీవి తాజాచిత్రం ‘గాడ్ ఫాదర్’లోనూ పూరి కాసేపు కనిపిస్తారని తెలుస్తోంది. మరి రాబోయే ‘జనగణమన’తో పూరి మునుపటి మ్యాజిక్ చేస్తారేమో చూడాలి.