బిగ్ బాస్ సీజన్ 6లో సెకండ్ వీక్ కెప్టెన్సీ పోటీ దారుని ఎంపిక చేసే క్రమంలో ‘సిసింద్రీ’ అనే ఆటను రెండు రోజుల పాటు నిర్వహించారు. ప్రతి కంటెస్టెంట్ కు వాళ్ల పేరుతో ఓ బొమ్మను పంపించి, దానిని ఆలనాపాలనా చూసుకోవాలని, వేరేవాళ్ళ చేతిలోకి ఆ బొమ్మ వెళ్ళిపోకుండా కాపాడుకోవాలని చెప్పారు. గతంలోనూ ఇలాంటి గేమ్ ఒకటి బిగ్ బాస్ నిర్వహించాడు. కానీ ఈసారి మరీ కంగాళీగా, నిస్పారంగా ఈ గేమ్ సాగింది. పాపం… మేల్ కంటెస్టెంట్స్ ఆ బొమ్మలను సాకుతున్న తీరు చూస్తుంటే జాలి వేసింది. ఇక పని కట్టుకుని బొమ్మను సాకుగా చూపించి గీతూని బిగ్ బాస్ ఆడుకున్నాడు. తొలి రోజు రెండు మూడు పోటీలు పెట్టి కొందరిని విజేతలుగా నిలిపాడు. రాత్రి వేళ వేరే వాళ్ళ బొమ్మలను కాజేయడానికి ఇద్దరు ముగ్గురు ఇంటి సభ్యులు నిద్రకూడా పోకుండా తీవ్ర ప్రయత్నం చేశారు. ఇంతా చేస్తే… సిసింద్రీలతో సంబంధం లేకుండానే కొన్ని పోటీలు పెట్టారు. అలా పెట్టిన కింగ్ ఆఫ్ ది రింగ్స్ టాస్క్ లో ఇనయా రెహ్మాన్ విజేతగా నిలిచింది. ఐస్ క్రీమ్ సెట్టింగ్ టాస్క్ ఫస్ట్ రౌండ్ లో రాజశేఖర్, రెండో రౌండ్ లో ఆర్జే సూర్య విన్ అయ్యారు. ఆ తర్వాత సిసింద్రీ గేమ్ ను క్లోజ్ చేసినట్టు బిగ్ బాస్ ప్రకటించడంతో కంటెస్టెంట్స్ తో పాటు వ్యూవర్స్ సైతం ఊపిరి పీల్చుకున్నారు.
రెండోవారం కెప్టెన్సీ పోటీ దారులుగా ఈ రెండు రోజుల పోటీల విజేతల నుండి చలాకీ చంటి, ఇనయా రెహ్మాన్, రాజశేఖర్, ఆర్జే సూర్య లను బిగ్ బాస్ ఎంపిక చేశాడు. ఈ నలుగురిలో ఒకరు బిగ్ బాస్ హౌస్ కు సెకండ్ కెప్టెన్ అవుతారు. మరి ఈ నలుగురికీ ఏదైనా టాస్క్ ఇస్తారా? లేకపోతే కంటెస్టెంట్స్ నుండే వీరిలో ఒకరిని కెప్టెన్ గా ఎంపిక చేసుకోమంటారా? అనేది చూడాలి.