Rs.2000 Notes: సమాజంలో జరిగిన ఒక ఘటన తరువాత అలాంటి కాన్సెప్ట్ తోనే ఒక సినిమా వస్తే.. వాస్తవ సంఘటనల ఆధారంగా అంటారు. కానీ, ఒక సినిమాలో జరిగినట్లు.. నిజ జీవితంలో జరిగితే.. అది ఒక్కసారి కాదు రెండు సార్లు జరిగితే.. ఏమంటారు..? ఇప్పుడు అదే విషయాన్ని చర్చించుకుంటున్నారు నెటిజన్లు. అసలు విషయంలోకి వెళ్తే.. దాదాపు ఏడేళ్ల కిందట కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని హీరోగా బిచ్చగాడు అనే సినిమా తెలుగులో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రంలో దేశ ఆర్థిక పరిస్థితి మారాలంటే ఏం చేయాలనీ అడుగగా.. ఒక బిచ్చగాడు.. పెద్ద నోట్లను రద్దు చేయాలనీ చెప్తాడు. అలా చేస్తే దేశం బాగుపడుతుందని చెప్తాడు. ఈ సినిమా వచ్చి 2016 మే 13న రిలీజ్ కాగా.. అదే ఏడాది నవంబర్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశంలో పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక అప్పుడు విజయ్ ఆంటోనిని అందరూ మెచ్చుకున్నారు. ఆయన కాన్సెప్ట్ నే ప్రధాని కాపీ చేసారని చెప్పుకొచ్చారు.
Manchu Vishnu: స్టార్ కమెడియన్ ఇంట్లో నోట్ల కట్టలు.. గుట్టు బయటపెట్టిన మా ప్రెసిడెంట్
ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా ఏడేళ్ల తరువాత బిచ్చగాడు 2 ను విజయ్ ఆంటోని తెరకెక్కించాడు. 2023, మే 19 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే రోజు సాయంత్రం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. దీంతో బిచ్చగాడుకు నోట్ల ఉపసంహరణకు లింకు ఉందని అభిమానులు నెట్టింట చర్చా గోష్ఠి పెట్టుకొస్తున్నారు. అయితే వారు మాట్లాడుకుంటున్నట్లు ఆ సినిమాకు, ఈ ఉపసంహరణకు అస్సలు సంబంధం లేదు. రెండు సంఘటనలూ యాదృచ్ఛికంగానే జరిగాయి. కానీ, టైమ్ అలా కలిసి వచ్చేసరికి ఈ నోట్ల ఉపసంహరణ ఘటనలో విజయ్ ఆంటోని పేరు మారుమ్రోగిపోతుంది. నెటిజన్లు తమకు తోచిన ఫన్నీ కామెంట్స్ పెడుతూ ఆడుకుంటున్నారు. ‘బిచ్చగాడు 3’ రాకుండా చూసుకోండయ్యా అని కొందరు.. విజయ్ ఆంటోనీని ఇక బిచ్చగాడు సినిమాలు తియ్యవద్దని చెప్పాలి ఇంకొందరు.. బిచ్చగాడు టైమ్ లో 500/1000 నోట్ల ఉపసంహరణ.. బిచ్చగాడు-2 రిలీజ్ టైమ్ కి 2000 నోట్ల ఉపసంహరణ.. ఈ లింకేమిటి సామీ? అని మరికొందరు చెప్పుకొస్తుండగా.. ఆయన అభిమానులు మాత్రం విజయ్ ఆంటోని అన్నా.. నువ్వేమైనా జ్యోతిష్కుడివా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఈ పబ్లిసిటీ మాత్రం బిచ్చగాడు 2 సినిమాకు బాగా ఉపయోగపడింది అని చెప్పాలి. ప్రస్తుతం బిచ్చగాడు 2.. విజయవంతంగా థియేటర్ లో రన్ అవుతూ రికార్డ్ కలక్షన్స్ రాబడుతుంది.