Pan India Movies: రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్.’ పుణ్యమా అని ఇప్పుడు భారతదేశమే కాదు… ప్రపంచంలోని సినీ జనం తెలుగు సినిమా రంగంపై ఓ కన్నేసిఉంచారు. టాలీవుడ్ నుండి రాబోతున్న సినిమాల మీద రకరకాల అంచనాలను ఏర్పరుచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ యేడాది తెలుగు నుండి పాతికపైగా పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇప్పటికే కొన్ని రిలీజ్ కాగా, గత వారం నుండి ఏప్రిల్ నెలాఖరు వరకూ వరుసగా ప్రతి వారం ఒక్కోటి చొప్పున ఆరు పాన్ ఇండియా మూవీస్ జనం ముందుకు రాబోతున్నాయి.
తెలుగు పాన్ ఇండియా ఫీవర్ ఉగాది రోజున విడుదలైన ‘దాస్ కా ధమ్కీ’తో మొదలైంది. విశ్వక్ సేన్ ద్విపాత్రాభినయం చేసి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘దాస్ కా ధమ్కీ’ ఐదు భాషల్లో విడుదలైంది. తొలి మూడు రోజుల్లోనూ ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 15 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని మేకర్స్ చెబుతున్నారు. విశ్వక్ సేన్ సినిమాల్లో ఇదే హయ్యెస్ట్ గ్రాస్ కలెక్షన్! మాస్ ఆడియెన్స్ ను టార్గెట్ చేస్తూ విశ్వక్ సేన్ రూపొందించిన ఈ సినిమాకు టాక్ బాగున్నా…. ఎందుకో కలెక్షన్లు మాత్రం ఆ స్థాయిలో లేవన్నది ట్రేడ్ వర్గాలు చెబుతున్న మాట. విశ్వక్ సేన్ సైతం తమ టార్గెట్ ఇంకా భారీగా ఉందని… దాన్ని రీచ్ అయ్యే దారిలో ఉన్నామని అంటున్నాడు. అయితే… ఆ లక్ష్యాన్ని ‘ధమ్కీ’ అందుకోవడం కష్టమే అనిపిస్తోంది.
ఇక ఈ నెల 30న తెలుగు నుండి మరో పాన్ ఇండియా మూవీ రాబోతోంది. అదే నేచురల్ స్టార్ నాని ‘దసరా’! నాని సినిమాలను గత కొద్ది కాలంగా తెలుగుతో పాటు ఇతర భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అలా ‘అంటే సుందరానికి’ మూవీ తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ విడుదలైంది. అయితే ఆ సినిమాకు ప్రతికూల ఫలితమే లభించింది. అయినా వెరవకుండా… ఇప్పుడు ‘దసరా’ మూవీని ఏకంగా ఐదు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్న నిర్మాతలు దేశ వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. రామగుండం బొగ్గు గనుల నేపథ్యంలో సాగే ఈ కథకు ఇతర ప్రాంతాల వారు ఎంతవరకూ కనెక్ట్ అవుతారనే సందేహం లేకపోలేదు. దాదాపు రెండు గంటల నలభై నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకు సెన్సార్ వారు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. అయితే పదహారు చోట్ల డైలాగ్స్ లోని పదాలను మ్యూట్ చేయమని ఆదేశించారట. ఇంతవరకూ నానిని వెండితెరపై ఇలాంటి మాస్ గెటప్ లో చూడలేదని జనం అంటున్నారు. ఫ్యామిలీ హీరో ఇమేజ్ ఉన్న నానిని ఈ పాత్రలో ఏమేరకు యాక్సెప్ట్ చేస్తారో చూడాల్సి ఉంది.
‘దసరా’ మూవీ తర్వాత తెలుగు నుండి రాబోతున్న మరో పాన్ ఇండియా మూవీ మాస్ మహరాజా రవితేజ ‘రావణాసుర’. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ రవితేజకు తొలి పాన్ ఇండియా సినిమా. దీని తర్వాత రాబోతున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ను సైతం అదే స్థాయిలో రిలీజ్ చేస్తామని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ‘రావణాసుర’లో ఏకంగా ఐదు మంది అందాల భామలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరితో పాటు నాగార్జున మేనల్లుడు సుశాంత్ కీ-రోల్ ప్లే చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ మూవీ మీద అంచనాలను పెంచుతున్నాయి. పైగా రవితేజ ‘ధమాకా’తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కడం, ఆ తర్వాత వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ సైతం విజయాన్ని నమోదు చేసుకోవడంతో… ‘రావణాసుర’ హ్యాట్రిక్ విజయాన్ని అందిస్తుందని ఆయన అభిమానులు నమ్ముతున్నారు.
‘రావణాసుర’కు కొనసాగింపుగా ఏప్రిల్ 14న మరో పాన్ ఇండియా మూవీ తెలుగు నుండి రాబోతోంది. అదే సమంత నటించిన ‘శాకుంతలం’. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ హిస్టారికల్ ఎపిక్ కు ‘దిల్’ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ త్రీడీలోనూ రూపొందింది. సమంత నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ -2’ వెబ్ సీరిస్, ‘యశోద’ సినిమా ఆమెకు జాతీయ స్థాయిలో గుర్తింపును తెచ్చిపెట్టాయి. దాంతో సహజంగానే ‘శాకుంతలం’పై ఓ మాదిరి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఈ మూవీ ట్రైలర్ ను చూసిన చాలా మంది పెదవి విరిచారు. మరి సినిమా ఏ స్థాయిలో ఉంటుందో, రిలీజ్ కు ముందు ఎలాంటి బజ్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
‘శాకుంతలం’ తర్వాత వారం అంటే.. ఏప్రిల్ 21న రాబోతున్న మరో తెలుగు పాన్ ఇండియా మూవీ ‘విరూపాక్ష’. సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ నుండి కోలుకున్న తర్వాత చేసిన మొదటి సినిమా ఇది. ఈ మిస్టిక్ థ్రిల్లర్ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్. కార్తీక్ దండు డైరెక్షన్ లో బివిఎస్ఎన్ ప్రసాద్ దీన్ని నిర్మించారు. ఈ సినిమాను కూడా ఐదు భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఈ తరహా థ్రిల్లర్ జానర్ మూవీస్ గతంలో చాలానే వచ్చినా, ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో మూవీ మీద అంచనాలు పెరిగాయి. మరి దానికి తగ్గట్టుగానే సినిమా ఉంటుందేమో చూడాలి.
ఇక ఏప్రిల్ చివరి వారం లో అంటే 28వ తేదీ వస్తున్న మరో తెలుగు పాన్ ఇండియా మూవీ అఖిల్ నటించిన ‘ఏజెంట్’. ఎంతో కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమాను ఎట్టకేలకు 28న వరల్డ్ వైడ్ విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సిద్ధపడ్డారు. దానికి తగ్గట్టుగానే కొంతకాలంగా ప్రచారాన్ని వేగవంతం చేశారు. అఖిల్ మేకోవర్ తో వస్తున్న ఈ మూవీ మీద అక్కినేని అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు. ‘సైరా’ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. దీనికి అతను నిర్మాణ భాగస్వామి కూడా. ఈ రకంగా తెలుగు నుండి వరుసగా ఆరు పాన్ ఇండియా సినిమాలు జాతీయ స్థాయిలో ప్రేక్షకులను అలరించబోతున్నాయి. ఈ సినిమాల విజయం మీదే ప్రస్తుతం సెట్స్ పై ఉన్న చిత్రాల భవిష్యత్తు ఆధారపడి ఉందన్నది వాస్తవం.