V.V. Vinayak: యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ వివి వినాయక్.. ఆది, చెన్నకేశవరెడ్డి, ఠాగూర్ లాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన వినాయక్ ఇటీవల కొంచెం జోరు తగ్గించాడు. అయితే దర్శకత్వం నుంచి నటుడిగా మారుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన నటించిన శీనయ్య విడుదలకు నోచుకోలేదు. త్వరలోనే మరో కొత్త చిత్రాన్ని తెరకెక్కించే పనిలో పడినట్లు సమాచారం. ఇక ఇవన్నీ పక్కన పెడితే చాలా రోజుల తరువాత వివి వినాయక్ మీడియా ముందుకు వచ్చాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వినాయక్ తన సినిమాలు గురించి చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలోనే చెన్నకేశవరెడ్డి క్యాస్టింగ్ గురించి మాట్లాడుతూ కొద్దిగా ఎమోషనల్ అయ్యారు. “నందమూరి బాలకృష్ణతో ఒక ఫ్యాక్షనిస్టు కథగా చెన్నకేశవరెడ్డి కథను రెడీ చేశాను. ఇక సినిమాలో ముఖ్యమైన పాత్రలు బాలయ్య భార్య టబు, చెల్లి దేవయాని. ఈ ఇద్దరు కోసం నేను ముందుగా అనుకున్నది సౌందర్య, లయ.
టబు ప్లేస్ లో సౌందర్య అనుకున్నాను, దేవయాని పాత్రలో లయను తీసుకుందామని ఆమెను వెళ్లి కలిశాను. బాలయ్యకు చెల్లెలిగా అని చెప్పేసరికి ఆమె వెంటనే ఏడ్చేసింది. ఏం సార్.. తెలుగు అమ్మాయిలు హీరోయిన్లు గా పనికిరారా..? అంటూ కంటనీరు పెట్టుకుంది. అది కాదమ్మా నీ ముఖం అమాయకంగా కనిపిస్తోంది.. అందుకే ఆ పాత్రకు సెట్ అవుతావు అని అడిగాను అని చెప్పాను. చెల్లెలి పాత్రకే ఎందుకు అడుగుతారండీ .. మీరు అలా చూడడం మానేయండి. మేము అన్ని పాత్రలు చేస్తాం అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఆమెకు సారి చెప్పి వచ్చేశా. అదే పాత్రకు దేవయానిని అడిగితె ఆమె వెంటనే ఒప్పుకొంది. ఏదిఏమైనా తెలుగులో తల్లి, చెల్లి పాత్రలను ఎంచుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని ” అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే చెన్నకేశవరెడ్డి మిస్ అయిన లయ బాలయ్య సరసన విజయేంద్ర వర్మ లో నటించింది.